ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు మోహన్ బాబు హై డ్రామా క్రియేట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని నడి రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకుని రాష్ట్రమంతా తిరిగి ఆ పార్టీకి ప్రచారం చేశారు.
ఒక తాజా ఇంటర్వ్యూలో ఆ విషయం ఏమైందని యాంకర్ ప్రశ్నించగా మోహన్ బాబు ఇచ్చిన సమాధానం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. “ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికి చెప్పకూడదు. కొంచెం ప్రాబ్లెమ్ అయితే ఉంది. అన్న గారి టైం నుండీ ప్రతి ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టించే కొంత మంది అధికారులు ఉంటారు. వారి పబ్బం గడుపుకోవడం కోసం తప్పు దారి పట్టిస్తారు,” అన్నారు.
ఆ సమస్య ఇప్పటి ప్రభుత్వం లో పరిష్కారమైందా అని అడిగితే, “సలహాలు ఇచ్చే వారు తప్పుడు సలహా ఇచ్చారని నేను విన్నాను. నాకు క్లారిటీ లేదు… ఆ క్లారిటీ ఉన్నప్పుడు… అంతా మంచే జరుగుతుంది అని నా అభిప్రాయం. ఇబ్బంది అయితే ఇప్పటికీ ఉంది,” అని మోహన్ బాబు నీళ్ళు నమిలారు.
అయితే మోహన్ బాబు వివాదం పై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. “చంద్రబాబు హయాంలో తప్పంతా చంద్రబాబు దే, అదే జగన్ హయాంలో జరిగితే అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారా? నిన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది మోహన్ బాబు,” అంటూ కొందరు చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు.





