ప్రముఖ నటుడు మోహన్ బాబు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, ఆయన కుటుంబంలో జరిగిన ఘర్షణలతో తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పుడు ‘మోహన్ బాబు యూనివర్సిటీ’లో జరిగిన అవకతవకలను రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ మండలి బయట పెట్టడంతో ఆయన పరువు పూర్తిగా పోయింది.
మోహన్ బాబు నిసందేహంగా మంచి నటుడే. ఆయన కష్టార్జితంతో ఆస్తులు కూడబెట్టుకున్నారు. విద్యాలయాలు స్థాపించారు. చాలా సంతోషమే. కానీ నీతి నిజాయితీ, నైతిక విలువల గురించి మాట్లాడుతూ యూనివర్సిటీలో విద్యార్ధుల నుంచి బలవంతంగా రూ.26.17 కోట్లు వసూలు చేశారని త్రిసభ్య కమిటీ నివేదికలో పేర్కొంది.
అందుకోసం విద్యార్ధులకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, విద్యార్ధుల హాజరులో అవకతవకలకు పాల్పడటం, హాస్టల్స్‌లో లేని విద్యార్ధుల నుంచి కూడా ఎమ్మెల్సీ ఛార్జీలు వసూలు చేయడం వంటి అనేక అవకతవకలకు పాల్పడినట్లు త్రిసభ్య కమిటీ నివేదికలో పేర్కొంది.
ఇందుకుగాను మోహన్ బాబు యూనివర్సిటీకి రూ.15లక్షలు జరిమానా విధించడమే, కాకుండా విద్యార్ధుల నుంచి బలవంతంగా వసూలు చేసిన రూ.26.17 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కూడా! ఈ పరిణామాలు చూస్తుంటే మంచు ప్రతిష్ట మెల్లగా కరుగుతున్నట్లే అనిపిస్తుంది.
సినీ నటుడుగా మోహన్ బాబుకి ఎంతో గౌరవం ఉంది. అలాగే విద్యావేత్తగా కూడా గౌరవం పొందుతున్నారు. కానీ ఎంతో శ్రమించి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, డబ్బు అన్నీ ఈవిదంగా చేజేతులా పోగొట్టుకుంతుండటం చాలా విచారకరమే!




