ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఈ లిక్కర్ కుంభకోణం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇక్కడ వైసీపీ నేతల ఆలోచన శైలిని పరిశీలిస్తే లిక్కర్ కేసులంటే లిక్కర్ బాటిల్స్ అనుకున్నట్టుగా ఉంది.
అక్కడ బాటిల్ ఖాళీ అవగానే లిక్కర్ అయిపోతుంది, బాటిల్ కూడా కింద పడేస్తారు, అదే మాదిరిగా ఇక్కడ కేసులో బెయిల్ రాగానే విచారణ పూర్తవుతుంది, ముందస్తు బెయిలు వస్తే కేసు నుండి బయటపడినట్టే అనుకుంటున్నారో ఏమో కాని,
లిక్కర్ కేసులో బైలు మీద బయటకొస్తే చాలు మహాప్రభో అన్నట్టుగా కొందరు, ముందస్తు బెయిలు వస్తే చాలు సామి అంటూ మరికొందరు బెయిలు కోసం తహతహలాడుతున్నారు. తాజాగా ఈ లిక్కర్ కేసు నుండి బయటపడాలి అనే ఆశతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హై కోర్ట్ లో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ వేశారు.
అయితే మోహిత్ రెడ్డి ముందస్తు బెయిలు అభ్యర్ధనను హై కోర్ట్ నిరాకరించింది. ఈ లిక్కర్ స్కాం కేసులో ఏ – 39 గా మోహిత్ రెడ్డి పై కేసు నమోదయ్యింది. 2024 ఎన్నికల సమయంలో నిధుల కోసం మోహిత్ రెడ్డి కంపనీల ద్వారా పార్టీ నేతలకు డబ్బులు మళ్ళించారంటూ అధికారులు ఆరోపిస్తున్నారు.
అలాగే ఆ నిధుల తరలింపు కోసం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వాహనాలను ఉపయోగించినట్టు కూడా మోహిత్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డి ముందస్తు బైలు అభ్యర్ధనను హై కోర్ట్ తిరస్కరించడం చెవి రెడ్డి కుటుంబానికి ఊహించని షాక్ అనే చెప్పాలి.




