చాలా అరుదుగా ఒక సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా ఇప్పటివరకు చూడలేదు కదా అనే భావన కలుగుతుంది. ఈమధ్యకాలంలో కాపీ, ఇన్స్పిరేషన్ చాలా కామన్ అయిపోతున్న ఈ తరుణంలో తమ సినిమానే ఒక రిఫరెన్స్ పాయింట్ అయ్యేలా చేయగలగడం అనేది పెద్ద టాస్క్. ఒక రాంగోపాల్ వర్మ, ఒక సందీప్ రెడ్డి వంగా వంటి విప్లవాత్మక ఫిలిం మేకర్స్ మాత్రమే అలాంటి సినిమా చేయగలిగారు.
ఇప్పుడు ఆ ఖాతాలో స్థానం సంపాదించుకున్నాడు మలయాళ దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్. గతంలో “ముకుందన్ ఉన్ని అసోసియేట్స్” అనే డార్క్ ఫిలిం తీసినప్పటికీ.. ఆ సినిమా మీద హాలీవుడ్ చిత్రం “నైట్ క్రాలర్” ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ.. అతడి తాజా చిత్రం “మాలీవుడ్ టైమ్స్” మాత్రం ఇదివరకెప్పుడూ చూడని ఓ భిన్నమైన ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
“ప్రేమలు” ఫేమ్ నస్లేన్ నటించిన ఈ సినిమా ఓ నిజాయితీగల సిన్సియర్ ఫిలిం మేకర్ బయోపిక్ లాంటిది. నరేటివ్ మొదలుకొని, ఎడిట్ ప్యాటర్న్, మ్యూజిక్, ఎస్.ఎఫ్.ఎక్స్, వి.ఎఫ్.ఎక్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. ఇది ఆల్రెడీ చూసామే అనే భావనే కలగలేదు. అదే సందర్భమో మలయాళ ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని కూడా నిక్కచ్చిగా, నిర్లజ్జగా తెరపై ప్రొజెక్ట్ చేసిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం.
మనకి తెలుగులో “నేనింతే” ఎలాంటి ట్రెండ్ సెట్టరో, మలయాళంకి “మాలీవుడ్ టైమ్స్” అలాంటి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. కాకపోతే.. ఇప్పుడున్న సెట్ ఆఫ్ ఆడియన్స్ కాస్త ఓపెన్ గా ఉన్నారు కాబట్టి.. ఇది కమర్షియల్ గాను సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి రిఫరెన్సులు, ఇన్స్పిరేషన్లు లేని ఒరిజినల్ సినిమాలు ప్రతి ఇండస్ట్రీ నుండి రావాలి, అప్పుడే ఒరిజినల్ సినిమా అనేది సర్వైవ్ అవుతుంది.




