ఇప్పుడు ఏపీ, తెలంగాణతో సహా దేశంలో చాలా రాష్ట్రాలలో విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్లు నిర్మిస్తోంది రైల్వే శాఖ. దశాబ్దాలుగా అరకొర సౌకర్యాలతో ఉన్న పాత రైల్వే స్టేషన్ల స్థానంలో కొత్త రైల్వే స్టేషన్లు నిర్మిస్తుండటం చాలా సంతోషమే!
కానీ రైళ్ళ సంగతి ఏమిటి? రైళ్ళంటే వందే భారత్ రైళ్ళు మాత్రమే కాదు. అనేక రకాల రైళ్ళున్నాయి. రైల్లో ఎక్కే ముందు “మీ ప్రయాణం సుఖవంతం అగుగాక” అని మైక్ పెట్టి మరీ చెపుతుంటారు. కానీ అరకొర వసతులు, బండరాయి వంటి బెర్తులు, నీళ్ళు లేక కంపు కొట్టే టాయిలెట్లు రైళ్ళలో ఉండే ఇటువంటి సమస్యలు ప్రతీ ఒక్కరికీ తెలుసు. దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలు వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. కనుక మన ప్రయాణం ఎలా సుఖవంతం అవుతుంది?
ఇక రిజర్వేషన్ చేసుకోవాలంటే అదో ప్రహసనం. రెండు మూడు నెలలు ముందుగా టికెట్ బుక్ చేసుకుందామన్నా వెయిట్ లిస్టులే దర్శనమిస్తాయి. అయినా రిజర్వేషన్ బుకింగ్, క్యాన్సిల్, తత్కాల్ బుకింగ్ బాదుడు తప్పదు.
దేశ జనాభా ఏటా 10 కోట్లు చొప్పున పెరుగుతోందనుకుంటే దానికి తగ్గట్లు కొత్త రైళ్ళు, రైల్వే ట్రాకులు వేస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఎప్పుడో బ్రిటిష్ వారు వేసిన ట్రాకుల, మార్గాలలోనే నేటికీ రైళ్ళు నడుస్తున్నాయి.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదేళ్ళలో దేశంలో కొత్తగా కొన్ని వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాకులు నిర్మించబడిన మాట వాస్తవం.
కానీ కొత్త ట్రాకులు, కొత్త రైళ్ళకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, తాజ్ మహల్ వంటి రైల్వే స్టేషన్లు నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో వేసిన పట్టాలు, వాటి వలన కలిగే ప్రయోజనాలు ఎవరికీ కనబడవు కానీ ఊరు మద్యలో ఉండే రైల్వే స్టేషన్లు అందరికీ కనపడతాయి కనుక!
బుల్లెట్ రైళ్ళు, హైస్పీడ్ రైళ్ళు చాలా అవసరమే. కానీ దేశ జనాభాలో సగం మంది దారిద్యంతో బాధ పడుతున్నప్పుడు అటువంటి సామాన్య ప్రజలు కూడా ప్రయాణించేందుకు వీలుగా ప్యాసింజర్ రైళ్ళు చాలా అవసరం. వాటి కంటే ముందు ఉన్న రైల్వే ట్రాకుల విస్తరణ, కొత్త కొత్త మార్గాలలో రైల్వే ట్రాకుల నిర్మాణం చాలా ముఖ్యం.
కానీ రాజుగారికి ఏది సరనిపిస్తే ప్రజలకు అదే సరనిపించాలి.. తాజ్ మహల్ వంటి రైల్వే స్టేషన్లే ముఖ్యం అనుకుంటున్నారు. కనుక మనం కూడా వాటిని చూసి మురిసిపోయి సేల్ఫీలు తీసుకొని బంధు మిత్రులకు పంపించిన తర్వాత అవే చెత్త రైళ్ళలో ఎక్కి ముక్కు మూసుకొని ప్రయాణించక తప్పదు.




