మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక రెడ్డి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు అంటూ ఆమె భర్త మంచు మనోజ్ నేడు అధికారికంగా మీడియా తో పంచుకున్నారు. రాబోయే ఎన్నికలలో మౌనిక పోటీ చేయబోతున్నారు అంటూ ప్రకటించిన మనోజ్ అందుకు మౌనిక ఏ పార్టీని ఎంచుకుంటారు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.
భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డి. వీరి కుటుంబానికి రాయలసీమలో బలమైన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. వారి వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మౌనిక అక్క భూమా అఖిల ప్రియ సైతం ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే గా చక్రం తిప్పుతున్నారు. ఈమెకు గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో మౌనిక పొలిటికల్ అరంగేట్రం కొరకు ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు.? అందుకు ఏ పార్టీ జెండా పట్టుకుంటారు.? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవంగా భూమా కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితులుగా ఉండే వారు.
ఆ తత్సబంధాలే వారిని వైసీపీ కి దగ్గర చేసాయి, జగన్ నాయకత్వంలో పనిచేసేలా చేసాయి. కానీ రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు అనేలా భూమా నాగిరెడ్డి టీడీపీ లోకి ఎంట్రీ ఇవ్వడం, ఆ తరువాత ఆయన మరణంతో భూమా కుటుంబానికి వైసీపీ కి మధ్య సంబంధాలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయాయి.
నాటి నుంచి భూమా రాజకీయ వారసురాలిగా టీడీపీ పార్టీ తరుపున భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్ఢ కేంద్రంగా రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు అటు మంచు కోడలిగా ఇటు భూమా రాజకీయ వారసత్వంతో మౌనిక రెడ్డి రాజకీయాలలో ఏ మేరకు రాణిస్తారు.? అనేది వేచి చూడాలి.
అయితే తాజగా మంచు మనోజ్, మౌనిక సంయుక్తంగా ” ఐక్య ధైర్య సేన సమితి” పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసారు. ఈ సంస్థ రాజకీయాలకు అతీతంగా కేవలం సేవా దృక్పధంతో ఏర్పాటు చేసిందే అంటూ మనోజ్ సంస్థ ఏర్పాటు పై స్పష్టత ఇచ్చారు.
మొదటి నుంచి రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో మౌనిక కు రాజకీయాలకు కొత్త కాకపోవచ్చు. గతంలో భూమా అఖిల ప్రియ కోసం కూడా మౌనిక ఎన్నికల ప్రచారం సాగించారు.
అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా క్షేత్ర స్థాయిలో మౌనిక రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుంది.? తన పొలిటికల్ ఎంట్రీ కి ఇటు పుట్టింటి సహకారం (అఖిల ప్రియ) అందుతుందా.? అటు మంచు వారి మెట్టినింటి (మోహన్ బాబు) మద్దతు దక్కుతుందా అనేది చూడాలి.?




