ధోని ఇంకా నిరూపించుకోవాలా? మరి వారి మాటేంటి?

India vs New Zealandటీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి చెప్పేదేముంది. ఇండియన్ సూపర్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ధోని, ఇండియాకు వరల్డ్ కప్ అందించి చరిత్ర సృష్టించాడు. ఇంతటి అనుభవం గడించిన ధోని నాయకత్వంలో గత కొన్ని మాసాలుగా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ గా టీంకు ట్రోఫీలను అందివ్వకపోవడంతో పాటు బ్యాటింగ్ లోనూ విఫలమవుతున్న ధోని ఆటతీరుపై తీవ్రస్థాయిలో అభిమానులు కూడా నిరుత్సాహపడుతున్నారు.

ఇలాంటి విమర్శకులకు సమాధానం చెప్పేందుకు, ఆదివారం నాడు జరిగిన మూడవ వన్డేలో ధోని 4వ నెంబర్ బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగాడు. నిజానికి ధోని ఎంట్రీ కివీస్ జట్టు కంటే టీవీల ముందు కూర్చున్న వీక్షకులకే షాక్ ఇచ్చింది. దీని వెనుక ఆంతర్యం ఏమిటా అన్న ఆసక్తి వ్యక్తం కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఎంట్రీపై పెదవి విప్పిన ధోని, సవివరంగా తెలిపారు. “తానేంటో చాటిచెప్పేందుకే నాలుగవ నెంబర్ బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగానని” చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

ADVERTISEMENT

“నేనేంటో నిరూపించుకోవాలంటే నాలుగవ స్థానమే సరైనదని భావించి వచ్చానని, సత్తా చాటానని, లోయర్ ఆర్డర్ లో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడానికి అవకాశం రావడం లేదని, క్రీజులో ఎంత ఎక్కువ సేపు ఉంటే, అంత బాగా ఆడడానికి వీలుంటుందని” ధోని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపుగా రిటైర్మెంట్ దశకు వచ్చాడని భావిస్తున్న టీమిండియా వన్డే సారధి ధోని, ఇంకా నిరూపించుకోవడం ఏంటి? అంటే ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం ధోనికి లేదా?

తను కెప్టెన్ కాబట్టి ఏ పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ లో బరిలోకి దిగే సౌలభ్యం దక్కింది. మరి జట్టులోని ఇతర క్రికెటర్ల మాటేమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మ్యాచ్ లో ధోని బాగానే ఆడాడు, జట్టు కూడా విజయం సాధించింది కాబట్టి, ఎలాంటి విమర్శలు వ్యక్తం కాలేదు. అదే పరిస్థితి తారుమారైతే ఈ పాటికి మీడియా వర్గాలన్నీ ధోని పనిపట్టే ప్రక్రియలో నిమగ్నమై ఉండేవి కదా! ఇదిలా ఉంటే, 2-1తో ముందంజలో ఉన్న ప్రస్తుత సిరీస్ అయినా ధోని నాయకత్వంలో గెలుపొందుతుందా? చూడాలి!

ADVERTISEMENT
Latest Stories