రాజకీయ పార్టీల అధినేతలు, ఆ పార్టీ అభ్యర్ధులు లేదా ఆ పార్టీల ముఖ్య నేతలో ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడితే దానికి ఓ విలువ ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందు పార్టీలో కొత్తగా చేరే పక్క వాయిద్యగాళ్ళ వలన శబ్ధ కాలుష్యం, రాజకీయ కాలుష్యమే తప్ప మరో ప్రయోజనం ఉండదు.
నిన్న మొన్నటి వరకు జనసేనలో చేరి ఎన్నికలలో పోటీ చేయాలని ఆరాటపడిన ముద్రగడ పద్మనాభం, జనసేన జాబితాలో తన పేరు కనబడకపోయే సరికి తాడేపల్లి ప్యాలస్‌కి వెళ్ళి వైసీపి కండువా కప్పుకొని వచ్చేసి అచ్చమైన వైసీపి నేతలాగ మాట్లాడేస్తున్నారు.
ఆయనకు కాపులను విడదీసి వైసీపి వైపు తీసుకు రావడం, ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్‌ని ఓడించాలనే రెండు టార్గెట్స్ జగన్ ఇచ్చినందున ఆయన అదే పనిలో ఉన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌ని ఓడించి తరిమిస్తేనే ఈ సినిమావాళ్ళు రాజకీయాలలోకి రాకుండా ఆపగలుగుతాము. పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్యేగా ఎన్నుకోమని కోరడం లేదు. తాను ఎమ్మెల్యే అవ్వాలనుకొంటున్నాను కనుక గెలిపించమని అడుగుతున్నారు.
ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించడం, ఆనక ఆయన సినిమా షూటింగ్‌ల బిజీగా ఉంటే, ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకొని ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలా?మొహాలకు రంగులేసుకొని వచ్చి మాయమాటలు చెప్పే ఇలాంటి మోసగాళ్ళని నమ్మి ఓట్లేస్తే మనమే నష్టపోతాము. పులివెందుల కంటే ముఖ్యం పిఠాపురం. ఇక్కడ పవన్ కళ్యాణ్‌ని ఓడించడం చాలా ముఖ్యం,” అంటూ ముద్రగడ పద్మనాభం ఇంకా చాలా మాటలే చెప్పారు.
కాపు జాతి శ్రేయోభిలాషినని గొప్పగా చెప్పుకొంటూ పవన్ కళ్యాణ్ గురించి ముద్రగడ పద్మనాభం ఈవిదంగా మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆయన కాపులలో తన బలం పెంచుకొని రాజకీయ నాయకుడుగా రాణించాలని తహతహలాడితే తప్పు కాదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలలో నటిస్తూ రాజకీయాలు చేయడం నేరం అన్నట్లు మాట్లాడుతున్నారు.
అయినా పోసాని, అలీ వంటి సినిమా వాళ్ళని వైసీపిలో పెట్టుకొని సినిమా వాళ్ళని తన్ని తరిమేయాలని ముద్రగడ చెపుతుండటం హాస్యస్పదంగా ఉంది కదా?
ఆయన ఇంతగా మాట్లాడుతున్నా వైసీపిలో జగన్‌తో సహా ఏ ఒక్కరూ ఆయనను పట్టించుకోవడం లేదు. ఇప్పుడే పట్టించుకోకపోతే రేపు ఎన్నికలలో వైసీపి గెలిస్తే జగన్ పట్టించుకుంటారా?లేక అవసరం తీరిన తర్వాత తల్లిని, చెల్లిని పక్కన పెట్టేసిన్నట్లు తనని పక్కన పడేస్తారా?ఇప్పుడు ఇంతగా పక్క వాయిద్యం వాయిస్తూ శబ్ధం చేస్తునందుకు, ఒకవేళ వైసీపి ఓడిపోతే తన పరిస్థితి ఏమిటి? అని ముద్రగడ ఆలోచించుకుని కాస్త ఆచితూచి మాట్లాడితే మంచిదేమో?




