కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం వెనుక వైసీపీ ఉన్నారని వచ్చిన విమర్శలు రాజకీయ విజ్ఞులకు విదితమే. అయితే దీనిపై చాలా సార్లు ముద్రగడ ఖండించినప్పటికీ, చేస్తున్న ప్రకటనలు, కార్యాచరణ వెనుక జగన్ ఉన్నారనే విమర్శలకు తానే మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లు అవుతోంది. అయితే తాజాగా మరోసారి ఇదే అంశంపై స్పందించారు ముద్రగడ.
“తన ఉద్యమం వెనుక జగన్ వున్నారనే వార్తల్లో నిజం లేదని, ఆ ప్రచారం అంతా అవాస్తమని, నిజానికి తాను సలహాలు తీసుకునే స్థాయి జగన్ కు లేదని, ఆ హోదాలో కూడా జగన్ లేరని” కీలక వ్యాఖ్యలు చేసారు. అలాగే పవన్ కళ్యాణ్ పై కూడా వివరణ ఇచ్చిన ముద్రగడ, “తన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను తానెప్పుడూ కోరలేదని, జూన్ తరువాత మలి దశ ఉద్యమం ప్రారంభమవుతుందని, బ్రిటీష్ హయాంలోనే కాపులను బీసీల్లో చేర్చాలని చెబితే, అప్పటి నుండి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చాయని” దుయ్యబట్టారు.



