యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరికొత్త ప్రాజెక్టు మొన్న ఈ మధ్య అధికారికంగా ప్రకటించారు. మహానటి లాంటి అద్భుతమైన సినిమాను అందించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని తన వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
సినిమా ఈ ఏడాది చివరన సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆరు నెలల నుండి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇది ఒక ఫాంటసీ చిత్రమని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని సమాచారం. అయితే ఈ లోగా మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
నవంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే లోగా నాగ్ అశ్విన్ ఒక వెబ్ సిరీస్ చెయ్యబోతున్నాడట. రానా హీరోగా ఈ వెబ్ సిరీస్ నాలుగు నెలల పాటు షూటింగ్ జరుపుకుంటుందట. రానాకు, నాగ్ అశ్విన్ కు ఇది డిజిటల్ డెబ్యూ కానుంది. అయితే ఈ వార్త మీద ప్రభాస్ ఫాన్స్ కస్సు మంటున్నారు.
ఒకపక్క ప్రతిష్టాత్మక సినిమా పెట్టుకుని ఇటువంటి సమయంలో నాలుగు నెలల పాటు వేరే ప్రాజెక్టు మీద దృష్టి పెట్టడం ఏంటని వారి ప్రశ్న. సినిమా సెట్స్ మీదకు వెళ్లే వరకు పూర్తిగా సినిమా మీదే దృష్టి పెట్టి పెద్ద హిట్ కొట్టాలని వారు కోరుకుంటున్నారు. అయితే దీని మీద నాగ్ అశ్విన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.





