సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా “రంగస్థలం” సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ వికలాంగుడిగా కనిపించనున్నారన్న టాక్ వినపడుతున్న నేపధ్యంలో… చెర్రీ కెరీర్ లో ఓ క్లాసికల్ గా నిలిచిపోయే చిత్రంగా ఉంటుందని సినీ జనాలు చాలా గట్టిగా చెప్తున్నారు. అయితే చెర్రీ బాటలోనే నాగచైతన్య కూడా పయనిస్తున్నాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
“యుద్ధం శరణం” సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో చైతూ తన తదుపరి సినిమా “సవ్యసాచి” గురించి చెప్పుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో… పాత్ర పరంగా తన కుడిచేతికి ఎంత పవర్ ఉంటుందో… ఎడమ చేతికి కూడా అంతే పవర్ ఉంటుందనీ, అయితే తన బ్రెయిన్ కంట్రోల్ లో లెఫ్ట్ హ్యాండ్ ఉండదనే కీలక విషయాన్ని స్పష్టం చేసాడు చైతూ.
మన శరీరంలోని ఒక అవయవం మన అధీనంలో లేకుండా పోతే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమాలో కీలకమని, ఎడమ చేయి తన కంట్రోల్ లో ఉండదని తెలిపాడు. అంటే చైతూ కూడా ఒక రకంగా వికలాంగుడి క్యారెక్టర్ నే పోషిస్తున్నాడన్న మాట. ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా దీనికి తగ్గట్లుగానే విడుదల చేయడం గమనించదగ్గ విషయం. తెలుగు హీరోలు కొత్తదనం కోసం ఎలా పరితపిస్తున్నారో ఈ స్టార్ వారసుల కధల ఎంపికలే చెప్తున్నాయి.


