హీరోయిన్ భావనపై జరిగిన అత్యాచార ఘటన పట్ల తానేమీ ఆశ్చర్యపోవడం లేదని, ఇలాంటి పరిస్థితి ప్రపంచం మొత్తం ఉందని… హాలీవుడ్ లో సైతం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ను ఊపేసిన హీరోయిన్ నగ్మా చెప్పుకొచ్చారు. మన దేశ సినిమా రంగానికి కూడా ఇలాంటి వేధింపులు కొత్త కాదని… దేశ వ్యాప్తంగా అన్ని రంగాలలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, ప్రతి ఒక్క మహిళ తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
అలాగే తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని, అయితే, తానిప్పటివరకు బయటకు చెప్పుకోలేదని… భావన బాటలోనే వరలక్ష్మి కూడా ధైర్యంగా ముందుకొచ్చి, విషయాన్ని బయటకు చెప్పిందని ప్రశంసించింది. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ రాజకీయ నాయకుడు, నటుడు కావడంతో… ఆమె ధైర్యంగా బయటకు చెప్పగలిగిందని, కానీ చాలామంది ఇలాంటి అఘాయిత్యాలపై మాట్లాడటానికి భయపడుతున్నారని తెలిపింది. అయినా ఈ స్థాయి వ్యక్తులకే లైంగిక వేధింపులు తప్పనపుడు, సామాన్య మహిళల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలని కోరింది.



