చివరి రక్తపు బొట్టు డైలాగ్.. బయటకు వెళ్ళినవారూ చెప్పారుగా

Nallapareddy-Prasanna-Kumar-Reddyరాజకీయాలలో తరచూ వినిపించే రొటీన్ డైలాగ్స్… “నా చివరి రక్తపు బొట్టు వరకు లేదా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు… ఫలానా పార్టీలోనే ఉంటా… మా అధినేత వెంటే నడుస్తా!” పార్టీ అధినేత తమని అనుమానిస్తున్నట్లు తెలిస్తే విధేయత చాటుకోవడానికి లేదా పార్టీ మారుతున్నట్లు మీడియాలో పుకార్లు ఖండించడానికి ఈ డైలాగ్స్ చెపుతుంటారని అందరికీ తెలుసు.

వైసీపీలో నుంచి ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తర్వాత, నెల్లూరులోనే మరో వికెట్ పడబోతోందంటూ సోషల్ మీడియా గుప్పుమంది. ఆ వికెట్టే… కొవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిది!

ADVERTISEMENT

ఆయన కూడా చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. కనుక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కనుక తర్వాత వికెట్ ఆయనదే అంటూ సోషల్ మీడియాలో కోడై కూసింది. ఇది ఆయన దృష్టికి రావడంతో వెంటనే ‘చివరి రక్తపు బొట్టు వరకు’ అంటూ ‘విధేయతా ప్రకటన’ చేయకతప్పలేదు.

కొవూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడుతున్న మైండ్ గేమ్. వచ్చే ఎన్నికలలో నాకు టికెట్‌ ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా వారి కోసం నేను పనిచేస్తాను.నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్‌ వెంటే నడుస్తాను,” అని అన్నారు.

అయితే ఆయన చేసిన ఈ విధేయత ప్రకటనలోనే టికెట్‌ లభించదనే వాస్తవం, బాధ కనిపిస్తున్నాయి. కనుక ఆ కారణంగా ఆయన అసంతృప్తిగా ఉండటం సహజం. కానీ టికెట్‌ విషయం తేల్చుకొనేవరకు వైసీపీలో కొనసాగాలనుకొంటున్నారు కనుక జగనన్నకు విధేయత ప్రకటిస్తూనే, పనిలో పనిగా తన టికెట్‌ సంగతి తేల్చమని చెప్పిన్నట్లు అర్దమవుతోంది.

మేకపాటికి, ఉండవల్లి శ్రీదేవిలని భ్రమలో ఉంచకుండా టికెట్‌ ఇవ్వలేమని ముందే చెప్పేశామని సజ్జల రామకృష్ణారెడ్డి గొప్పగా చెప్పుకొన్నారు కనుక నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి కూడా ఆ ముక్క ఇప్పుడే చెప్పేస్తే, ఆయన వైసీపీ కోసం రక్తం కార్చాలో వద్దో నిర్ణయించుకొంటారు.

అయినా వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురూ కూడా పార్టీలో ఉన్నప్పుడు నిత్యం ఇదే డైలాగ్స్ చెప్పేవారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందురోజు వరకు ఉండవల్లి శ్రీదేవి ఇదే డైలాగ్ చెప్పారు. ఇప్పుడు విలన్‌గా డైలాగ్స్ చెపుతున్నారు. అది వేరే విషయం. కనుక నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా టికెట్‌ ఇవ్వమని చెప్పేస్తే రేపు ఆయన కూడా వారిలాగే విలన్‌ డైలాగ్స్ చెప్పకుండా ఉంటారా?

ADVERTISEMENT
Latest Stories