‘వార్’ డిసైడ్ అయ్యింది… అయితే అది ‘వన్ సైడ్’ అవుతుందో… లేక గట్టి పోటీ అవుతుందో ఇప్పుడే చెప్పలేం గానీ, ‘మెగా’ వర్సెస్ ‘నందమూరి’ వర్గాలకు మాంచి ఊపోచ్చింది. దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన కాసేపటికి, క్రిష్ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “గౌతమీపుత్ర శాతకర్ణి” కూడా విడుదలైంది.
‘వారియర్’ లుక్ లో బాలయ్య విశ్వరూపం ప్రదర్శించినట్లుగా కనపడుతున్న ఈ పోస్టర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. ‘తన సత్తా చూడమంటూ’ సవాల్ విసురుతున్న బాలయ్య స్టిల్ తో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో అదిరిపోయే పోస్టర్ తో ముందుకు రావడంతో… ఈ సందర్భంగా మెగా హీరోల వీక్ నెస్ ను సోషల్ మీడియా వేదికగా ఏకరువు పెడుతున్నారు నందమూరి ఫ్యాన్స్.
కధలు లేవంటూ తెలుగు దర్శకుల మీద నిందలు వేస్తూ పరాయి భాషా సినిమాలను రీమేక్ లు చేసే హీరోలు ఉన్న నేటి రోజుల్లో, ఒక తెలుగు దర్శకుడిని నమ్మి తెలుగు జాతి గర్వించదగ్గ సినిమాను అందిస్తున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” చిత్ర యూనిట్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు నందమూరి అభిమానులు. ఈ డైలాగ్స్ ఏ హీరోలను ఉద్దేశించి చెప్పారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా..!



