విందు భోజనంలోనైనా అన్నీ ఒక్కసారే వడ్డించేస్తే తినడం కష్టం. ఆ తర్వాత జీర్ణించుకోవడం ఇంకా కష్టం. కానీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న పోలిపల్లి సభలో వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా అందరికీ ఒకేసారి అన్నీ వడ్డించేశారు. వాటిని జీర్ణించుకొని జవాబు చెప్పడానికి వైసీపి నేతలకి కాస్త టైమ్ అవసరమే. అందుకే ‘సోషల్ మీడియా మంత్రులు’ ఎవరూ ఇంకా స్పందించలేదు.
గతంలో నారా లోకేష్‌కు మాట్లాడటం చేతకాదని ఎద్దేవా చేసిన వైసీపి నేతల కోసం ప్రత్యేకంగా చెప్పిన పంచ్ డైలాగులు వింటే ‘ఔరా’ అని వాళ్ళు కూడా ముక్కున వేలేసుకోక తప్పదనిపిస్తుంది.
“ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో… ఏ బొమ్మ చూస్తే జగన్‌కు జ్వరం వస్తుందో… ఏం బొమ్మ చూస్తే తాడేపల్లి ప్యాలస్‌లో టీవీలు పగులుతాయో… ఆ బొమ్మ ఈరోజు మనమందరం ఇక్కడ వేదిక మీద చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు నాయుడు, పవరుఫుల్ పవనన్న… మన సింహం బాలయ్య బాబు… ముగ్గురూ ఒకే బొమ్మలో ఉండటం అదుర్స్… మీడియా మిత్రులారా… ఒకసారి జూమ్ చేయండమ్మా… బొమ్మ తాడేపల్లి ప్యాలస్‌లో బాగా పడాలి,” అని నారా లోకేష్ అన్నారు.
టిడిపి, జనసేనలు కలవనీయకూడదని, చంద్రబాబు నాయుడుని ఎన్నికల వరకు జైల్లోనే ఉంచేయాలని జగన్ కోరుకొంటే అందుకు విరుద్దంగా అందరూ కలిశారు… అందరూ ఒకే వేదికపై కనిపించారు. అందుకే బొమ్మ జూమ్ చేసి తాడేపల్లి ప్యాలస్ టీవీలో బాగా కనపడేలా చేయాలని నారా లోకేష్ చెప్పారని అర్దమవుతూనే ఉంది.
జగన్ ప్రభుత్వం ‘అడుదాం ఆంధ్ర’ అంటూ చేస్తున్న హడావుడిపై కూడా నారా లోకేష్ తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శించారు.
“నాలుగున్నరేళ్ళుగా మా జీవితాలతో ఆడుకొన్నది చాలదా?అని ప్రజలందరూ అడుగుతున్నారు. జగన్ ఒక ఐపిఎల్ టీం పెడితే దాని పేరు కోడికత్తి వారియర్స్! దానిలో అందరి కంటే సీనియర్ బ్యాట్స్ మ్యాన్ అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఆయన కొట్టిన దెబ్బకు బాబాయ్ వివేకా కనపడకుండా పోయారు కదా?
ఇంకా బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భారత్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యపు మధుసూధన్ రెడ్డి… ఇంకా చాలా మంది ప్లేయర్లు ఉన్నారు,” అని నారా లోకేష్ వ్యంగ్యంగా అన్నారు.
జగన్ పాలనలో పన్నులు, ఛార్జీలు పెంచేస్తుండటంపై స్పందిస్తూ, “జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వాసు మీ ఇంటికి ఓ గొట్టం పట్టుకొని వస్తాడు. దానిని ఊదమని అడిగితే ఎవరూ తొందరపడి ఊదొద్దు. ఊదితే మీరు ఎంత గాలి పీలుస్తున్నారో లెక్క కట్టి దానికీ పన్ను కట్టమంటారు… మన కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్ జగన్,” అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
జగన్ తన ఎమ్మెల్యేలను మార్చుతుండటంపై స్పందిస్తూ, “మన ఇంట్లో చెత్తని తీసుకువెళ్ళి పక్కింటి వాళ్ళ ముందు పోస్తే ఊరుకొంటారా? మనకి చెత్త అయినప్పుడు పక్కింటివాళ్ళకి అది బంగారం అయిపోదు కదా?చెత్త చెత్తే… అలాగే ఒక నియోజకవర్గానికి పనికిరారనుకొన్న ఎమ్మెల్యేలను మరో నియోజకవర్గంలో పోటీ చేయిస్తే పనిచేస్తారా? చేయలేరు కదా?కనుక ఎమ్మెల్యేలను కాదు… జగన్‌నే మార్చేయాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది,” అని నారా లోకేష్ అన్నారు.




