సుదీర్గ యువగళం పాదయాత్ర నేటితో ముగింపు!

Nara Lokesh Yuva Galam Padayatra Ends

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించి 226 రోజులలో 11 ఉమ్మడి జిల్లాలలో 97 నియోజకవర్గాల గుండా సాగింది. దారిలో 232 పట్టణాలు, 2,094 గ్రామాలలో వివిద వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతూ 3,132 కిమీలు పాదయాత్ర చేశారు.

ADVERTISEMENT

యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్‌ 70 బహిరంగ సభలు, 154 ముఖాముఖీ సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 80 రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 5,353 వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతీ 100కిమీలకు ఒక శిలాఫలకం ఆవిష్కరిస్తూ, వాటిలో ఆయా నియోజకవర్గాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను లిఖింపజేశారు. ఏపీలో టిడిపి అధికారంలోకి రాగానే వాటన్నిటినీ అమలుచేస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ ప్రజలకు ఇచ్చిన కొన్ని హామీలను ఇప్పటికే టిడిపి మ్యానిఫెస్టోలో చేర్పించడమే కాకుండా, మినీ మ్యానిఫెస్టోలో వాటిని ప్రకటించారు కూడా.

నారా లోకేష్‌ పాదయాత్రని పోలీసులతో అడ్డుకోవడానికి వైసీపి ప్రభుత్వం మొదట్లో చాలా ప్రయత్నించింది. కానీ దాని వలన పాదయాత్రకు తామే ఉచిత ప్రచారం చేస్తున్నామని, నారా లోకేష్‌కి ప్రజల సానుభూతి పెరుగుతుందని గ్రహించి వైసీపి ప్రభుత్వం ఆ ప్రయత్నాలు విరమించుకొంది. కానీ కృష్ణా, గుంటూరు జిల్లాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు వైసీపి శ్రేణులు ఆయనపై భౌతిక దాడులు కూడా చేశాయి. కానీ నారా లోకేష్‌ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకే సాగారు.

కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వరకు 400 రోజులలో 4,000 కిమీలు పాదయాత్ర చేయాలని నారా లోకేష్‌ అనుకొన్నారు. కానీ మద్యలో జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు పేరుతో అరెస్టు చేసి రాజమండ్రి జైలుకి పంపించడం, నారా లోకేష్‌తో సహా మిగిలిన ముఖ్యనేతలందరిపై కూడా అనేక కేసులు నమోదు చేయడంతో సుమారు మూడు నెలలు యువగళం పాదయాత్ర నిలిపివేసి న్యాయపోరాటాలు చేయాల్సివచ్చింది.

ఇప్పుడు ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నందున, ముందు అనుకొన్నట్లుగా ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగిస్తే పార్టీ అభ్యర్ధుల ఎంపిక, తదితర కార్యక్రమాలకు సమయం సరిపోదు. కనుక నేడు విశాఖ నగరంలో శివాజీపాలెం వద్ద యువగళం పాదయాత్ర ముగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అక్కడ శిలాఫలకం ఆవిష్కరించనున్నారు.

నారా లోకేష్‌ తల్లి భువనేశ్వరి, అత్తగారు వసుంధర తదితర కుటుంబ సభ్యులు కూడా తరలివచ్చి గాజువాక నుంచి యువగళం ముగింపు యాత్రలో పాల్గొంటున్నారు.

నేటితో విశాఖ నగరంలో యువగళం పాదయాత్ర ముగుస్తున్నప్పటికీ, ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలకు మద్యన ఉండే భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద ఈ నెల 20వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ సభకు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణతో సహా రాష్ట్రంలో టిడిపి ముఖ్య నేతలందరూ హాజరుకాబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories