కామెడీ సినిమాల హీరోగా వెలుగొంది, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ… సినీ సామ్రాజ్యంలో 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేష్, తాజాగా ఎప్పుడూ ఎవరికీ చెప్పని ఓ చిలిపి సంఘటనను వెల్లడించాడు. శ్రీదేవి తన కంటే వయసులో రెండు సంవత్సరాలు పెద్దదని, చిన్నతనంలో తమ ఇంటి పక్కనే శ్రీదేవి ఉండేదని, తామిద్దరం కలిసి ట్యూషన్ కు వెళ్ళేవాళ్ళమని, ఒక రోజు శ్రీదేవికి ‘ఐ లవ్ యూ’ అని చెప్పానని గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
అయితే నేను చెప్పిన విషయానికి, శ్రీదేవి ‘మా అమ్మతో చెప్తానని’ అనడంతో, భయపడి ఇంకా శ్రీదేవి వైపు చూడటమే మానేసానని, అయితే మళ్ళీ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా అయిన తర్వాత, ఒక సమయంలో తనకు ఎదురు పడినపుడు, స్వయంగా శ్రీదేవి వచ్చి తనను పలకరించిందని, అంతేగాక, నాటి ‘ఐ లవ్ యూ’ చెప్పిన సంఘటనను గుర్తు చేసి తనకు షాక్ ఇచ్చిందని నరేష్ తన గత స్మృతులను పంచుకున్నాడు.
అంటే ‘అతిలోకసుందరి’ శ్రీదేవి అంటే పడిపోయిన జాబితాలో మరో హీరో ఉన్నాడన్న విషయాన్ని నరేష్ స్పష్టం చేసాడు. అయితే అందరి కంటే ముందే శ్రీదేవికి ప్రపోజ్ చేసాడన్న విషయం తెలిసి వచ్చింది. నాటి హీరోల నుండి నేటి హీరోల వరకు… ఎక్కువ మంది సినీ హీరోలు ఇష్టపడే హీరోయిన్ గా శ్రీదేవి పేరు ఎప్పుడూ సినీ వర్గాలలో హల్చల్ చేస్తూనే ఉంటోంది.



