సంక్రాంతి బరిలోకి లాస్ట్ మినిట్‌లో దూకేసిన మూవీ నారి నారి నడుమ మురారి. ఎలాంటి ఎంట్రీ ఇచ్చిందంటే ఏదో పండక్కి తోసేసి వదిలించుకుందామని మూవీ టీం అనుకుంటున్నారనే ఫీల్‌తో ఎంట్రీ ఇచ్చింది. సినిమా మీద ఎవరికీ పెద్దగా హోప్ లేకపోవడమే దీనికి ముఖ్య కారణం.
మూవీ రిలీజ్‌కి ముందు హీరో శర్వానంద్ కానీ, డైరెక్టర్ లేదా నిర్మాత అనిల్ సుంకర ఇచ్చిన ఇంటర్వ్యూలు, సినిమాని పెద్దగా లేపింది లేదు, ప్రేక్షకులని ఎక్సైట్ చేసింది లేదు.
తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ప్యూర్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో సినిమాని జనాలు బాగానే లేపారు, దాంతో సినిమాకి కూడా గ్రాఫ్ బాగానే లేచింది. అయితే ఎటొచ్చీ ఈ కలెక్షన్స్ సరిపోతాయా అంటే ఠక్కున జవాబు చెప్పడం కష్టమే.
అమెరికాలో కూడా సునాయాసంగా మిలియన్ క్లబ్‌లో జాయిన్ అవ్వాల్సిన మూవీ ఇంకా $700K దగ్గరే కొట్టుకోడానికి కారణం? అమెరికాలో మంచు తుఫాన్ అంటే అది పెద్ద జోకే, పండగ సినిమాలకు దొరికిన అతి మంచి ఎక్స్క్యూజ్ అది.
మరి సినిమాకి టాక్ బాగున్నా పెద్దగా వండర్స్ చేయకపోవడానికి కారణం ఏంటి? పండగ తర్వాతే మా సినిమా రన్ స్టార్ట్ అవుతుంది అని అనిల్ సుంకర చెప్పుకున్నట్లు అవ్వకపోవడానికి కారణం?
ముఖ్య కారణం హీరో పూర్ ఫామ్. శర్వా సినిమా బాగానే ఉంది అన్నా, OTTలో చూసుకోవచ్చులే అనుకునేవాళ్లే ఎక్కువ ఈ రోజుల్లో. దానికి తన వరుస ఫ్లాపులు ఒక కారణమైతే, అసలు హీరోనే దాదాపు మరిచి పోయారేమో అన్నట్టు చేశాడు శర్వానంద్. ఆడియన్స్‌కు ఎప్పుడూ హీరోలో ఒక ఎనర్జీ, ఇంటరెస్ట్ చూడాలనుకుంటారు. హీరోనే అమావాస్యకి, పౌర్ణమికి ఒకసారి కనిపిస్తే సగటు ప్రేక్షకుడికి ఏం పోయింది చూసుకోవడానికి, చెప్పే మాటలు వినడానికి బొచ్చెడు హీరోలు.
డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఇంకా ఆడియన్స్ కి కొత్త పేరే, అతనిదో ఓల్డ్ స్టయిల్. పోనీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ఏమన్నా బజ్ లేపగలరా అంటే అదీ లేదు, ఎప్పుడో తీసిన దూకుడు, ఆగడు ముచ్చట్ల దగ్గరే ఆగిపోయారు ఆయన.
అందుకే నారీ నారీ.. అల్ప సంతోషులకు దారి అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వచ్చింది చూసుకుని చంకలు కొట్టుకుంటే, పోయింది ఎప్పటికి తెలియదుగా!






