‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన ‘మాస్ మహారాజా’ రవితేజ త్వరలో ‘టచ్ చేసి చూడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ముందుగా సంక్రాంతి సమయానికే విడుదల చేయాలని భావించినప్పటికీ, పవన్ కళ్యాణ్, బాలకృష్ణల సినిమాలు బరిలో ఉండడంతో వెనక్కి తగ్గిన రవితేజ, రిపబ్లిక్ దినోత్సవానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ ఫేంల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. రామ్ తాళ్ళూరి నిర్మించబోతున్న ఈ సినిమాకు “నేల టికెట్” అనే మాస్ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ టైటిల్ విన్న వెంటనే రవితేజకు ఇది ‘పర్ ఫెక్ట్’ అన్న టాక్ అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది.
‘మాస్ మహారాజా’గా రవితేజకున్న ఇమేజ్ తెలియనిది కాదు. అందుకు తగ్గట్లుగా “నేల టికెట్” అన్న టైటిల్ పెడితే, ఫ్యాన్స్ కు పండగేనని చెప్పక తప్పదు. జనవరి రెండవ వారంలో షూటింగ్ కు వెళ్ళడానికి సిద్ధమవుతోన్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ “నేల టికెట్”లో రవితేజ పక్కన నటించే ముద్దుగుమ్మ ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది.





