అధికారికంగా రిలీజ్ చేసిన తర్వాత చూసిన సినిమా కంటే, విడుదలకు ముందే లీక్ అయితే వచ్చే కిక్కే వేరు కదా! ఇది ఒక్క సినీ రంగానికే పరిమితం కాలేదు. 2 వేల రూపాయల నోటు అధికారికంగా విడుదల చేసే కంటే ముందు, సోషల్ మీడియాలో సదరు నోటు ముద్రణ లీక్ అయ్యి, హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అందుకే ఏ రంగంలో అయినా లీకులకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.
2000 రూపాయల నోటు మాదిరే గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో 50 రూపాయల నోటు హల్చల్ చేస్తోంది. అయితే ఇది లీక్ లో భాగంగా నెట్టింట సందడి చేస్తుందన్న వైనం తెలియగా, తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ధృవీకరించింది. భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథంతో పాటు స్వచ్ఛ భారత్ లోగోను ఈ నోటు వెనుక భాగంలో ముద్రించారు.
ఇక నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ ఫొటోతో పాటు దేవనాగరి లిపిలో 50 రూపాయలను సూచించే సంఖ్య, ఆర్బీఐ అని మైక్రోలెటర్స్, ఇండియా అన్న పదాలతో ముద్రణ జరిగిందని ఆర్బీఐ తెలిపింది. కుడివైపు భారత జాతీయ చిహ్నం, ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్, ఆరోహణ క్రమంలో నెంబరు ప్యానెల్ వుంటాయి. ఈ నోటు 66 ఎంఎం వెడల్పు, 135 ఎంఎం పొడవు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
ఈ నోటు ఫ్లోరొసెంట్ బ్లూ కలర్ లో ఉంటుందని తెలిపిన ఆర్బీఐ, మరో కీలక విషయంపై స్పష్టత ఇచ్చింది. గతంలో 500 నోట్ల మాదిరి కాకుండా, ఈ 50 రూపాయల కొత్త నోట్లతో పాటు, పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో మరో పుకార్లకు తెరలేపకుండా స్పష్టత ఇచ్చినట్లయ్యింది.


