జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఓ శిధిల నగరంగా మార్చేసి, తాను చంద్రబాబు నాయుడుపై ప్రతీకారం తీర్చుకున్నానని సంతోషించారే తప్ప దాని వలన ఏపీకి తీరని ఆర్ధిక, పారిశ్రామిక నష్టం కలుగుతోందని ఎవరు చెప్పినా పట్టించుకోలేదు. ఓ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన ఈ తప్పు ఏపీ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది.
ఆ తప్పుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వెంటనే సరిదిద్దే ప్రయత్నం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో మాట్లాడి అమరావతి చుట్టూ 189 కిమీ పొడవునా అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ కోసం రూ.20-25,000 కోట్లు ఆర్ధిక సాయం సాధించారు.
అమరావతి నగరాన్ని చంద్రబాబు నాయుడు డిజైన్ చేయించినప్పుడే దానిని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మూడు ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ విశాలమైన ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించేలా ప్రణాళికలు సిద్దం చేశారు.
తద్వారా రాష్ట్రంలో కడప, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలకు చక్కటి ఎక్స్‌ప్రెస్ హైవేలు ఏర్పడి ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడుపై ద్వేషం, కక్షతో జగన్ ఆ పనులన్నిటినీ పక్కన పడేశారు.
ఇదీ ఒకందుకు మంచిదే అనుకోవచ్చు. అవి జగన్ చేతిలో పడి ఉంటే పనులు పూర్తికాకపోగా ఆ పేరుతో కూడా భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడి ఉండేవారు. వైసీపి నేతలకు లబ్ధి కలిగేలా రోడ్లు మెలికలు తిప్పుతూ అంచనాలను భారీగా పెంచేసేవారు.
ఇందుకు ఉదాహరణగా అమరావతి-అనంతరం యాక్సస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు గురించి చెప్పుకోవచ్చు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం ఆరు లేన్లతో 393 కిమీ పొడవు ఉండే ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తే, జగన్ వచ్చాక దానిని పులివెందులవైపు తిప్పుకున్నారు.
కనుక జగన్ ఏ కారణంతో వాటిని పక్కన పడేసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందుగా అనుకున్నట్లే అన్నీ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ప్రారంభించబోయే ఎక్స్‌ప్రెస్ హైవేలు సుమారు 3 ఏళ్ళలోగా పూర్తయ్యే అవకాశం ఉంది.
అవి పూర్తయ్యేలోగా అమరావతిలో నిర్మాణాలకు రూపురేఖలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ అద్భుతమైన రాజధాని నగరం, సువిశాలమైన ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్లు ఏర్పడనున్నాయి. వాటితో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి.
అమరావతి నిర్మాణ పనులు, అవుటర్ రింగ్ రోడ్ పనులు, మౌలిక వసతుల కల్పన పనులతో భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించబోతున్నాయి.
ఈ పనులన్నీ పూర్తయితే చంద్రబాబు నాయుడు పేరు మరోసారి మారుమ్రోగిపోవడం ఖాయం. ఇటువంటి గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్న జగన్మోహన్ రెడ్డి దురదృష్టవంతుడు కాదా?




