సినిమాలో క్లైమాక్స్ ఉంటుంది కానీ రాజకీయాలలో ఉండదా?

No Climax For Political Crimes

అవి అక్రమాస్తుల కేసులు కావచ్చు లేదా వివేకానంద రెడ్డి హత్య కావచ్చు లేదా మద్యం కుంభకోణం కేసు కావచ్చు లేదా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ లేదా కాళేశ్వరం కేసు కావచ్చు.. ప్రతీ కేసులో పాత్రధారుల వరకు తప్పితే సూత్రధారుల వరకు దర్యాప్తు సంస్థలు చేరుకోలేకపోతున్నాయి!

సరే కీలక వ్యక్తులపై కేసు నమోదు చేసి సాక్ష్యాధారాలన్నీ సేకరించేశారు…. కొంతమందిని లోపల వేశారనుకుంటే… వారు కూడా ఇలా వెళ్ళి అలా బెయిల్‌పై బయటకొచ్చేస్తున్నారు.

ADVERTISEMENT

ఆ తర్వాత ఈ కేసులు కోర్టుకి చేరుతాయి. అప్పటి నుంచి ఏళ్ళ తరబడి విచారణ సాగుతుందే తప్ప ఏ ఒక్క కేసులో దోషులను నిర్ధారించి శిక్షలు వేసిన దాఖలాలు లేవు.

కనుక మద్యం కుంభకోణం కేసులో మిధున్ రెడ్డినో మాజీ మంత్రి నారాయణ స్వామినో విచారణకు పిలిచినా, రిమాండ్‌పై జైలుకి పంపినా ఒరిగేదేమీ ఉండదని ఈ కేసులు చూస్తే అర్ధమవుతుంది.

సినిమాలలో విలన్ ఎవరో తెలుస్తున్నా క్లైమాక్స్ వరకు హీరో ఏమీ చేయడు. అలాగే విలన్ డెన్‌కి హీరో వచ్చినా ‘ఈసారి తప్పకుండా నీ అంతు తేలుస్తానని’ చెప్పి పంపిచేస్తారు తప్ప హీరోని తాకను కూడా తాకడు. ఎందుకంటే సినిమా రెండున్నర గంటలు సాగాలి మద్యలో హీరో, హీరోయిన్లు డ్యూయేట్స్, ఓ ఐటెం సాంగ్ వగైరా తంతు పూర్తవ్వాలి కనుక. అవన్నీ పూర్తయ్యాక క్లైమాక్స్‌ ఫైట్‌లో తప్పకుండా విలన్ పని పడతాడు హీరో.

సినిమా మద్యలో ఇవన్నీ చివరిలో క్లైమాక్స్ ఉంటుందని అందరికీ తెలుసు కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఈ క్లైమాక్స్ సీన్ ఎప్పటికీ రాదనే అనిపిస్తోంది.

హీరోలు, విలన్లు, వారి గ్యాంగులు అందరూ కళ్ళెదుటే తిరుగుతుంటారు. ఒకరిపై మరొకరు రోజూ రంకెలు వేసుకుంటూనే ఉంటారు.

జైల్లో చిప్పకూడు తినక తప్పదని అధికార పార్టీ నేతలు హెచ్చరిస్తూనే ఉంటారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని రాజకీయకక్ష బాధితులు సవాళ్ళు విసురుతూనే ఉంటారు. కానీ ఏమీ జరుగదు.

సోషల్ మీడియాలో కూడా ప్రసారమవుతున్న ఈ డైలీ సీరియల్ నుంచి తప్పించుకోలేక ప్రజలు కూడా విసుక్కుంటున్నారు.

ఇంతకీ ఈ కేసులలో సూత్రధారులు లేదా ఫైనల్ బెనిఫిషరీలను టచ్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎవరు ఎందుకు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? ఎవరూ అడ్డుకోకపోతే ఎందుకు డైలీ సీరియల్ ముగించడం లేదు? ముగించలేనప్పుడు ఎందుకు మొదలుపెట్టారు?అనే సామాన్య ప్రజల ప్రశ్నలకు సమాధానాలు దొరకవు.

ADVERTISEMENT
Latest Stories