నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తున్నారని అందరూ అంగీకరిస్తారు.
వాటిలో పెద్దనోట్ల రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 371 రద్దు, ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలు, జీఎస్టీ అమలు, పాకిస్తాన్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్, కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం, అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తిచేయడం, ఈశాన్య రాష్ట్రాలలో సొరంగ మార్గాల ద్వారా రోడ్, రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం, బుల్లెట్ రైలు వంటివి అనేకం ఉన్నాయి.
వీటిలో పెద్దనోట్ల రద్దు, లాక్‌డౌన్ వంటి కొన్ని నిర్ణయాల వలన దేశ ప్రజలకు ఊహించని స్థాయిలో తీవ్ర సమస్యలు ఎదుర్కొని చాలా నష్టపోగా, మిగిలిన వాటి వలన దేశానికి ఎంతో మేలు జరుగుతోంది. కనుక మంచి అయినా చెడు అయినా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ప్రధాని నరేంద్రమోడీకి ఉందని అర్దమవుతోంది.
ఇప్పుడు ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ పేరిట లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థలన్నిటికీ కలిపి ఒకేసారి జమిలి ఎన్నికల కోసం రంగం సిద్దం చేస్తున్నట్లున్నారు.
నిజానికి ఈ జమిలి ఎన్నికల గురించి మోడీ చాలా కాలంగానే చెపుతున్నారు. అయితే ఏడాదిలో వివిద రాష్ట్రాలలో వివిద సమయాలలో జరిగే శాసనసభ ఎన్నికల నిర్వహణ, లోక్‌సభ ఎన్నికలతో కలిసి శాసనసభ ఎన్నికల నిర్వహణే ఎంతో వ్యయప్రయాసలతో కూడుకొన్నది. ఇక దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసనసభ, స్థానిక సంస్థలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే ఇంకెంత కష్టమో ఊహించవచ్చు.
కానీ అన్నిటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించగలిగితే, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ధికభారం సగానికి సగం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారి అన్ని ఎన్నికలు జరిగిపోతే మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎన్నికల గురించి ఆలోచనలు చేయవలసిన అవసరం ఉండదు కనుక దేశాభివృద్ధి వేగవంతం అవుతుంది.
కనుక దీని సాధ్యాసాధ్యాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ నేతృత్వంలో ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఆ కమిటీ వివిద ప్రభుత్వ శాఖలు, ఆర్ధిక, రాజకీయా, న్యాయ నిపుణులు, మేధావులను, సామాన్య ప్రజలను, దేశంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించి, క్రోడీకరించి 18,629 పేజీలతో కూడిన ఓ సమగ్రమైన నివేదికని తయారు చేసింది. ఆ నివేదికని వారు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతికి అందజేశారు.
ఈ నివేదికలో వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. కానీ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో 5 ప్రధాన సవరణలు చేయాలని, వీటి కోసం ప్రత్యేకంగా ఉమ్మడి ఓటర్ల జాబితాను తయారుచేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత 5 ఏళ్ళ పదవీకాలం పూర్తికాక మునుపే ఏ కారణం చేతైనా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం దిగిపోతే లేదా కూలిపోతే ఏం చేయాలి?వంటి అనేక ప్రశ్నలకు ఆ నివేదికలో సమాధానాలు, పరిష్కారాలు సూచించిన్నట్లు తెలుస్తోంది.
కనుక ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే, ప్రధాని నరేంద్రమోడీ 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే భావించవచ్చు.




