ఆపరేషన్ సింధూర్ 2.0ని ట్రంప్‌ ఆపగలరా?

Operation Sindhoor 2.0

ఈ ఏడాది మే 7 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు భారత్‌-పాక్ మద్య ప్రత్యక్ష యుద్ధం జరిగింది. భారత్‌ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల పాకిస్తాన్‌ని ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేస్తామంటూ గట్టి హెచ్చరిక చేయడంతో భారత్‌-పాక్ మద్య ఆపరేషన్ సింధూర్ 2.0 ‘మాటల యుద్ధం’ మళ్ళీ మొదలైంది.

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ, “ఈసారి భారత్‌ దుసాహసానికి ప్రయత్నిస్తే దాని యుద్ధ విమానాల శిధిలాల కిందే భారత్‌ని పాతి పెట్టేస్తాం. భారత్‌ ప్రభుత్వం, మంత్రులు తమ అసమర్ధత, వైఫల్యాల నుంచి తమ దేశ ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఇటువంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మా జోలికి వస్తే మేమే భారత్‌ని తుడిచి పెట్టేస్తాం,” అంటూ ఘాటుగా బదులిచ్చారు.

ADVERTISEMENT

భారత్‌ కంటే కొన్ని గంటల ముందు పాకిస్తాన్‌ స్వాతంత్ర్యం పొందింది. ఈ 75 ఏళ్ళలో పాక్ పాలకులు అవినీతికి పాల్పడుతూ పాక్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు.

తమ దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ప్రతిష్ట మంట గలుపుకున్నారు.

కనుక తమ అవినీతి, అసమర్ధత ఆ కారణంగా దేశంలో పెరిగిన పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యల నుంచి తమ ప్రజల దృష్టి మళ్ళించడానికే కశ్మీర్‌ని ఓ పెద్ద సమస్యగా మార్చేశారు.

అయితే నేటికీ తమ అధీనంలో ఉన్న ఆక్రమిత కశ్మీర్‌ని కూడా చక్కదిద్దుకోలేకపోయారు. అక్కడి ప్రజలు భారత్‌లో విలీనం అవుదామని కోరుకుంటున్నారు.

చివరికి ‘ఆపరేషన్ సింధూర్’ని అడ్డుకోలేకపోగా, బ్రహ్మోస్ క్షిపణుల దాడిలో పాకిస్తాన్‌ అనేక యుద్ధ విమానాలను కూడా కోల్పోయింది. కనుక ‘టోటల్ ఫెయిల్యూర్‌’కి అర్ధం చెప్పమంటే పాకిస్తాన్‌ ప్రభుత్వమని చెప్పవచ్చు.

కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌ ప్రతిష్ట, పాక్ ఆర్మీ, నేవీ, వాయుసేన ప్రతిష్ట మంటగలిసిపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, నేటికీ నిసిగ్గుగా ఆ పదవిలో ఉండటమే కాకుండా మళ్ళీ ఈవిదంగా ప్రగల్భాలు పలుకుతున్నారు.

బహుశః అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తమని చంక నెక్కించుకున్నారు కనుక ఈసారి అయన తమకు అండగా ఉంటారనే భ్రమలో ఉన్నారేమో?

కానీ అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్‌ ఎన్నికవడానికి ఎంతగానో సాయపడిన ‘ఎలన్ మస్క్’నే ఆయన నిర్మొహమాటంగా తీసి పక్కన పడేసినప్పుడు పాకిస్తాన్‌ని నెత్తిన పెట్టుకుంటారా? ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలుపెడితే దానిని ట్రంప్‌ కూడా ఆపలేరని పాక్ గుర్తుంచుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories