తెలుగు సినీ చరిత్రలో సంచలన దర్శకుల జాబితాలో పూరీ జగన్నాధ్ పేరు ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి పూరీ సినిమాలు, ప్రస్తుతం ప్రేక్షకులలో ఏ మాత్రం ఆసక్తిని పెంచలేకపోతున్నాయి. అంతకుముందు కూడా పూరీ సినిమాలు పరాజయం పాలయ్యాయి, అయితే ఎంతో కొంత ఏదొక కోణంలో ప్రేక్షకులను సంతృప్తి పరిచేవి. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా పూరీ సినిమాల పయనం సాగుతోందని చెప్పాలి.
గతాన్ని… వర్తమానాన్ని పోలిస్తే… గతంలో పూరీ దర్శకత్వం వహించిన సినిమాలు ఎలా ఉన్నా… ఆయా సినిమాలలో పాటలు అద్భుతంగా ఉండేవి. పూరీ కెరీర్ లో ఫ్లాప్ లుగా నిలిచిన “హార్ట్ ఎటాక్, ఇద్దరమ్మాయిలతో, కెమరామెన్ గంగతో రాంబాబు, నేను నా రాక్షసి, ఏక్ నిరంజన్, సూపర్, 143, ఆంధ్రావాలా, శివమణి, బాచి” వంటి సినిమాలలో అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఆల్బమ్ అంతా అదిరిపోకపోయినా… దాదాపుగా మూడు, నాలుగు పాటలు ఖచ్చితంగా చార్ట్ బస్టర్స్ నిలిచే పాటలు ఉన్నాయి.
ఇక హిట్ సినిమాల సంగతి చెప్పనవసరం లేదు. ‘బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, గోలీమార్, బిజినెస్ మెన్’ వంటి సినిమాలలో పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల మదిలో పాడుతుంటాయి. కానీ ‘టెంపర్’ నుండి పూరీ సంగీత శైలి మారింది. కమర్షియల్ గా పరవాలేదనిపించిన ‘టెంపర్’తో మొదలైన పూరీ డౌన్ ఫాల్ “జ్యోతి లక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్” తాజాగా “పైసా వసూల్” వరకు నిర్విరామంగా కొనసాగుతోందని చెప్పాలి.
బాలయ్యతో తెరకెక్కించిన “పైసా వసూల్” ఆడియోలో కనీసం ఒక్క పాట కూడా వినసొంపుగా లేకపోవడం పూరీ ఏ పరిస్థితులలో ఉన్నారో అర్ధమవుతోంది. ఎన్టీఆర్ రీమిక్స్ సాంగ్ ను ఆల్బమ్ లో పెట్టలేదు కాబట్టి, ఆ పాట ఏమైనా ఆకట్టుకుంటుందేమో గానీ, నాలుగు పాటలు, ఒక థీమ్ మ్యూజిక్ ఉన్న “పైసా వసూల్” ఆల్బమ్ కర్ణకఠోరంగా ఉండడం విశేషం. ఇటీవల కాలంలో అనూప్ అందించిన ఆల్బమ్స్ లో అతి తక్కువ మార్కులు వేయించుకున్న ఆల్బమ్ గా ఈ ‘పైసా వసూల్’ నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు.


