మరో డజను మందిపై ఈసీ వేటు… ఇకనైనా మారుతారా?

palnadu-elections-2024

ఏపీలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింస, దాడులపై కేంద్ర ఎన్నికల కమీషన్‌ తీవ్రంగా స్పందించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌తో సహా పలువురు పోలీస్ అధికారులపై వేటు వేసి, వారిపై శాఖ పరమైన విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది.

పోలింగ్‌ అనంతరం పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో వైసీపి నేతలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. టిడిపి నేతలు, కార్యకర్తలు, టిడిపికి ఓట్లు వేశారని అనుమానిస్తున్న సామాన్య ప్రజలపై దాడులు చేశారు. వైసీపి మూకలను కట్టడి చేయాల్సిన పోలీసులు టిడిపి నేతలు పిర్యాదులు చేస్తే గానీ పట్టించుకోలేదు.

ADVERTISEMENT

రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ఎన్నికల సంఘం ఆధీనంలోనే ఉన్నప్పటికీ ఈ అల్లర్లు, దాడులపై ముఖేష్ కుమార్‌ మీనా కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.

కానీ కేంద్ర ఎన్నికల కమీషన్‌ స్పందిస్తూ డిజిపి హరీష్ కుమార్‌ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డిని నిన్న ఢిల్లీకి రప్పించుకొని వివరణ కోరింది.

అనంతరం అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురు పోలీస్ అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారందరిపై ప్రత్యేక బృందంతో విచారణ జరిపించి రెండు రోజులలో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కేంద్ర ఎన్నికల కమీషన్‌ వేటు వేసిన అధికారులు వీరే:

1. పల్నాడు జిల్లా కలెక్టర్‌: బదిలీ, శాఖపరమైన విచారణ.

2. పల్నాడు, అనంతపురం ఎస్పీలు: సస్పెన్షన్, శాఖపరమైన విచారణ.

3. తిరుపతి ఎస్పీ: బదిలీ శాఖపరమైన విచారణ.

4. పల్నాడు, అనంతపురం, తిరుపతి మూడు జిల్లాలో 12 మంది సీఐ, ఎస్సై స్థాయి అధికారులు: సస్పెన్షన్, శాఖపరమైన విచారణ.

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ చేత వీరందరిపై విచారణ జరిపించి రెండు రోజులలో వారిపై తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశించింది. ఈ దాడులకు పాల్పడిన వారందరిపై సంబందిత సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి ఆ వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది.

ఏపీలో చెలరేగిన ఈ హింసను కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఎంత తీవ్రంగా పరిగణించిందంటే, జూన్ 4న ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తూ, జూన్ 19వరకు రాష్ట్రంలో 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించి ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఓటమి భయంతో టిడిపి నేతలే తమపై ఈ దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని, కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని మంత్రి అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణా రెడ్డి తదితర వైసీపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

కానీ కేంద్ర ఎన్నికల కమీషన్‌ జారీ చేసిన తాజా ఉత్తర్వులలో చాలా స్పష్టంగా ‘ప్రతిపక్ష పార్టీ కార్యాలయం, వాహనాలకు నిప్పు పెట్టారని, ప్రతిపక్ష నేతలపై రాళ్ళ దాడులు జరిగాయని, బెదిరింపులకు పాల్పడ్డారని” పేర్కొంది. వైసీపి మూకలే ఈ దాడులు చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈసీ కూడా తన లేఖలో ఇదే ధృవీకరించింది. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, పల్నాడు, గుంటూరు, నంద్యాలలో జరిగిన దాడులను ఈసీ తన లేఖలో పేర్కొంది.

ఇప్పటికే డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డితో సహా అనేకమందిపై ఈసీ వేటు వేసింది. ఇప్పుడు పల్నాడు జిల్లా కలెక్టర్‌తో సహా మరో డజను మంది పోలీస్ అధికారులపై కూడా వేటు వేసింది. కనుక ఇకనైనా మిగిలిన పోలీస్ అధికారులు వైసీపి మూకలను కట్టడి చేస్తారా లేదో చూడాలి.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని ఈసీ భావించడం వైసీపి అరాచక పాలనకు ఓ చక్కటి నిదర్శనంగా భావించవచ్చు. ఎన్నికల గంట మ్రోగినప్పుడే జగన్‌ చొక్కా మడత పెట్టి అందరూ యుద్ధానికి సిద్ధం కావాలని వైసీపి శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అదే జరిగింది. ఇంకా జరుగుతోంది కూడా. అంటే ఈ అల్లర్లు ఏదో క్షణికావేశంతో జరిగినవి కావని, ముందుగానే ప్లాన్ చేసుకుని చేసినవే అని స్పష్టం అవుతోంది.

ప్రజావేదిక కూల్చివేయడంతో రాష్ట్రంలో విధ్వంసం పాలన ప్రారంభించిన వైసీపి ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే వరకు ఆ విధ్వంసం కొనసాగిస్తోంది. ఇందుకేనా ప్రజలు మళ్ళీ ఓట్లు వేసి జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించాలి?

ADVERTISEMENT
Latest Stories