Telugu Film Industry

ఒకప్పుడు తెలుగు సినిమాలు తెలుగు వారి కోసమే తీసేవారు. కనుక అచ్చ తెలుగు సినిమా పేర్లు… అచ్చ తెలుగు భాషలో డైలాగులు… అచ్చమైన తెలుగు సాహిత్యంతో పాటలు… అచ్చమైన తెలుగు వాతావరణం ప్రతీ తెలుగు సినిమాలో ఉట్టిపడేవి.

అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా మూవీ స్థాయికి ఎదిగిపోయాయి. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయస్థాయికి కూడా ఎదిగిపోయాయి.

Also Read – అరెస్ట్ చేస్తే జైల్లో యోగా చేసుకుంటా: కేటీఆర్‌

కనుక సినిమా పేరు మొదలు కధ, కధనం, ఫైట్స్, పాటలు, సంగీతం, నటీనటులు… ప్రతీదీ అందరినీ మెప్పించేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో సినిమాలో నుంచి తెలుగు ఆవిరి అయిపోతోంది. నేతి బీరకాయలలో నెయ్యి ఉందనట్లే పాన్ ఇండియా మూవీలలో తెలుగు కనపడటం లేదు.

కానీ ఆ సినిమాని మన దర్శకుడు, మన హీరోతో చేశాడు కనుక అది మన సినిమాయే అని సర్ధిచెప్పుకోవలసి వస్తోంది. పాన్ ఇండియా మూవీ కనుక అన్ని రాష్ట్రాల ప్రజలతో కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీయాల్సి ఉంటుంది కనుక తెలుగు నేటివిటీని పూర్తిగా వదిలేసుకోక తప్పడం లేదు.

Also Read – ఏపీకి పర్యాటక రంగమే అక్షయపాత్ర కాబోతోందా?

అయితే పాన్ ఇండియా మూవీలు తీసే దర్శక నిర్మాతల అదృష్టమో లేదా తెలుగుజాతి దౌర్భాగ్యమో కానీ ఇప్పుడు తెలుగు ప్రజల జీవన శైలి, ఆలోచనా ధోరణి పూర్తిగా మారి, భాషపై పట్టు, మమకారం రెండూ తగ్గిపోయాయి. అందువల్ల తెలుగుదనం లేని పాన్ ఇండియా మూవీలకు, ఈ మార్పులకి చాలా వేగంగా అలవాటుపడ్డారు. ఇందుకు సంతోషిచాలో బాధపడాలో తెలీని పరిస్థితి.

అయితే తమిళ సినీ దర్శక నిర్మాతలు మాత్రం ఏమాత్రం మొహమాటపడకుండా తమ భాషలో, తమ సంస్కృతీ సాంప్రదాయాలతో, తమ నటీనటులతో, అచ్చమైన తమ తమిళ నేటివిటీతో సినిమాలు తీసి డబ్బింగ్ చేసి చూస్తే చూడండి లేకుంటే మీ ఖర్మ అన్నట్లు వదులుతున్నారు.

Also Read – నాడు పప్పూ అన్నారుగా… ఇప్పుడు భయపడితే ఎలా?

ఇందుకు తాజా ఉదాహరణగా ‘వెట్టాయన్’ సినిమా ఇంకా థియేటర్లలోనే ఉంది. కనీసం సినిమా పేరు తెలుగులోకి మార్చకుండా వదిలితే జనాలు చూసి సంతోషించారు.

ఆ భాషాభిమానం వారికే చెల్లు. కనుక మనకు భాషాభిమానం లేనందుకు బాధపడాలి తప్పితే వారి భాషాభిమానం చూసి అసూయ పడక్కర లేదు.

అయితే తెలుగు సినిమాలో ఎవరూ ఊహించని మంచి కూడా జరుగుతోంది. పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు అందరూ పాన్ ఇండియా మూవీలకు షిఫ్ట్ అయిపోవడంతో, చిన్న సినిమాలకు మార్గం సుగమం అయ్యింది.

కొత్త దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, రచయితలు, నటీనటులు అచ్చమైన తెలుగు సినిమా పేర్లతో అచ్చమైన తెలుగు భాష, నేటివిటీ, ఇంకా చెప్పాలంటే చక్కటి మాండలికాలతో అలరించే సినిమాలు తీసి అందిస్తున్నారు.

తెలంగాణ మాండలికంలో వచ్చిన బలగం సినిమా, ఆంధ్రాలో రాయలసీమ , గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రా మాండలికాలు, నేవిటీలతో ఇటీవల వస్తున్న సినిమాలు అందరినీ, ముఖ్యంగా తెలుగు సినీ, భాషాభిమానులను అలరిస్తున్నాయి. కనుక చిన్న సినిమాలు తెలుగు సినిమాని కాపాడుతున్నందుకు చాలా సంతోషమే.