వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు మూడేళ్లంటూ.. దశదిశలా ఉత్సావాలు జరపాలంటూ ఆ పార్టీ నేతలు హడావిడి చేస్తున్నారు. అయితే దీనిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్సవాలు కాదు అభివృద్ది, ప్రగతిని ఆపినందుకు దశదిశలా కర్మకాండలు పెట్టాలంటూ విరుచుపడ్డారు.
“జగన్ పాలనలో సంక్షేమం చచ్చిపోయింది. ప్రజా సంక్షేమానికి నూరేళ్లూ నిండాయి. ఒక చేత్తో డబ్బులు ఇచ్చి మరో చేత్తో లాక్కోవడమే వైసీపీ విధానం. జగన్ తొలి అడుగుతో రాప్ట్రంలో వేల ఎకరాలు కబ్జాలకు గురయ్యాయి. జగన్ ముఖ్యమంత్రి కావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది,” అంటూ ఆమె ఆరోపించారు.
“కులం ప్రాతిపదికన ఏపీలో పాలన సాగుతుంది. ఒకే సామాజిక వర్గానికి 870 పోస్టులా? దళితులకు శిరోముండనం చేయడమేనా కన్నీళ్లు తుడవడమంటే? 17 నెలల్లో 600కు పైగా జరిగిన అత్యాచారాలకు ఏం సమాధానం చెబుతారు? దిశ చట్టం కింద ఇప్పటివరకూ ఎంతమందికి శిక్ష పడింది?,” అని ఆమె ప్రశ్నించారు.
ఆరోపణల సంగతి ఎలా ఉన్నా 3000 పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర … జగన్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాట మాత్రం వాస్తవమే. పాదయాత్రకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువే. అయితే ఆ పాదయాత్ర మొత్తం మార్చేసింది. 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. దానిని వైకాపా వారు సహజంగానే సెలెబ్రేట్ చేసుకుంటారు.




