హిందూపురంలో పరిపూర్ణ అయోమయం… అయినా తగ్గేదేలే

paripoornananda-swami-hindupur

యూపీలో యోగి ఆదిత్యనాధ్ రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టగా లేనిది నేను ఎన్నికలలో పోటీ చేస్తే తప్పేమిటని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రశ్నకు బీజేపీ కూడా జవాబు చెప్పలేక ఈసారి హిందూపురం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తానంటే సరేనంది.

ADVERTISEMENT

అయితే అది ఒకప్పటి మాట. కానీ ఆయన ఆ మాట పట్టుకొని హిందూపురంలో ఆశ్రమం (క్యాంప్) ఏర్పాటుచేసుకొని గత కొన్ని నెలలుగా చాలా హడావుడి చేస్తున్నారు.

కానీ టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులలో భాగంగా హిందూపురం లోక్‌సభ, శాసనసభ రెండు సీట్లు కూడా టిడిపికి దక్కాయి. శాసనసభకు మళ్ళీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ సీటుకి బీకే పార్ధసారధి పేర్లు టిడిపి ఖరారు చేసింది.

దీంతో పరిపూర్ణ స్వామీజీకి ఆనందం కరువైంది. స్వామీజీకి ఆగ్రహం, అసహనం కలిగింది. కనుక బీజేపీ టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను హిందూపురం నుంచే లోక్‌సభకు పోటీ చేస్తానని ప్రకటించేశారు. నందమూరి బాలకృష్ణ తనకు సీటు దక్కకుండా చేసినందుకు తాను హిందూపురం శాసనసభ స్థానానికి కూడా పోటీ చేస్తానని ప్రకటించారు.

దీంతో ఇటు బీజేపీలో అటు టిడిపిలో కూడా కలకలం మొదలైంది. ఆయనకు నచ్చజెపాలని టిడిపి బీజేపీపై ఒత్తిడి చేస్తోంది. బీజేపీ కూడా ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆయన భీష్మించుకొని కూర్చున్నట్లు తెలుస్తోంది.

టిడిపి, జనసేన, బీజేపీల కూటమిలో ఈ పరిణామం చూసి వైసీపి ఎంపీ అభ్యర్ధి శాంతమ్మ, ఎమ్మెల్యే అభ్యర్ధి కురుబా దీపికా ఇద్దరూ చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే హిందూపురంలో సుమారు 60 వేల మంది ముస్లిం ఓటర్లున్నారు.

ఒకవేళ స్వామీజీ ఈ ఎన్నికలలో ఏవిదంగా పాల్గొని పరిపూర్ణం చేసినా అప్పుడు నియోజకవర్గంలో ముస్లింలు అందరూ గంపగుత్తగా తమకే ఓట్లు వేస్తారని భావిస్తున్నారు. అది నిజం కూడా. కనుక హిందూపురంలో స్వామీజీ సృష్టించిన ఈ పరిపూర్ణ అయోమయాన్ని తొలగించే బాధ్యత బీజేపీ పెద్దలదే. లేకుంటే అనపర్తి సీటు విషయంలో పునరాలోచించుకోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories