నిర్మాతల ఇబ్బందులను పవన్ సీరియస్ గా తీసుకోరా

Pawan Kalyan doesn't taking producers problems seriouslyహిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఒకే క్రేజ్ ని నిలబెట్టుకోవడం అందరి వల్ల అయ్యేపని కాదు. అందులోనూ పాతికేళ్ల సుదీర్ఘ కెరీర్ లో ముప్పై సినిమాలు కూడా పూర్తి కాని పవన్ కళ్యాణ్ అంతకుమించి అనేలా స్టార్ డం ని పెంచుకుంటూ పోవడం నిజంగా అరుదైన విషయమే. అలాంటి పవర్ స్టార్ డేట్లు ఇచ్చినా సినిమా చేసేందుకు అంగీకారం తెలిపినా ఏ నిర్మాతకైనా అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. తమ బ్యానర్ కో మైలురాయి హిట్ అయితే కనకవర్షం ఖాయమని సిద్ధమైపోతారు. ఒకవేళ ఫలితం తేడా కొట్టినా మరీ తీవ్రంగా నష్టాలు రాకుండా కలెక్షన్లతో మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టే ప్రొడ్యూసర్లు తనతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

కానీ పరిస్థితులు అన్ని వేళలా ఒకేలా ఉండవు కదా. జనసేనతో పవన్ చాలా బిజీగా ఉన్నాడు. ఇంకో ఏడాదిన్నర దాటితే ఎన్నికలు వస్తాయి. ఈసారి అవకాశం మిస్ అయితే ఇంకో అయిదేళ్ళు ఎదురు చూడాలి. అప్పటికి సామాజిక సమీకరణాలు ఎలా ఉంటాయో ప్రభుత్వ ధోరణి ఎలా ఉంటుందో చెప్పలేం. అధికార పార్టీకి వ్యతిరేక గాలి వీస్తున్నప్పుడే గురి చూసి కొట్టాలి. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాల కన్నా ఎక్కువగా రాజకీయాల మీదే ధ్యాస పెట్టడం కళ్లముందు కనిపిస్తోంది. అలా అని సినిమాలు మానేశాడా అంటే అదీ లేదు. పోనీ ప్రొడ్యూసర్లకు రెండేళ్ల తర్వాత కలవండి అంటున్నాడా అదీ జరగడం లేదు. ఇదే వాళ్ళను త్రిశంకు స్వర్గంలోకి నెట్టేస్తోంది.

ADVERTISEMENT

హరిహరవీరమల్లు ఈ ఏడాది వేసవిలోనే రావాల్సింది. ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే ఈపాటికి థియేట్రికల్ రన్ పూర్తయిపోయి ఓటిటిలో చూసేవాళ్ళం. కానీ నిర్మాత ఏఎం రత్నం దర్శకుడు క్రిష్ సైతం ఖచ్చితంగా 2024లో ఫలానా డేట్ కి వస్తామని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతానికి పవన్ యాక్టివ్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడు కానీ ఎప్పుడు ఏ బ్రేక్ పడుతుందో తెలియదు. మొన్నే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అధికారికంగా లాంచ్ చేశారు. పోనీ అదెప్పుడు కంప్లీట్ అవుతుందో అంతు చిక్కడం లేదు. రెండు రోజులు షూటింగ్ చేసి మరీ విరామమిచ్చారు. రెగ్యులర్ షూట్ కు వెళ్ళేదాకా ఎప్పుడు రిలీజ్ ఉంటుందో ఎవరికీ తెలియదు.

ఇవి చాలవన్నట్టు వినోదయ సితం రీమేక్ ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. ఇది పవన్ ఫ్యాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. ఉస్తాద్ భగత్ సింగే తేరి రీమేక్ అన్న వార్తలను హరీష్ శంకర్ ఖండించలేదు. అలాంటప్పుడు మళ్ళీ ఇంకొకటి అంటే అభిమానులకు కష్టమేగా. ఇవి నిర్మిస్తున్న బ్యానర్లన్నీ అడ్వాన్స్ ల రూపంలో హీరోకి ఇతర ముఖ్యమైన క్రూకి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టేశారు. వాటికి వడ్డీల భారం పడుతుంది. పవన్ ఏదీ సరిగా తేల్చడం లేదు. ఎవరికి వారు వీరమల్లు తర్వాత మాదేననే అంచనాలో ఉన్నారు కానీ లోలోపల పెండింగ్ పడుతుందేమోనన్న టెన్షన్ లేకపోలేదు. పవన్ ఇలా ఒకేసారి రెండు బాణాలు విసరడం మీద ఒక క్లారిటీకి రావడం చాలా అవసరం. తనకు కాదు ఎదురు చూస్తున్న నిర్మాతలకు.

ADVERTISEMENT
Latest Stories