అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెద్ద విరాళం ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ 30 లక్షల విరాళం ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్ ను బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కు అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ అగ్ర రాజకీయ నాయకుడైనా అయోధ్య రామ మందిరానికి చేసిన అతిపెద్ద వితరణ ఇది.
అయోధ్యలో ఆలయానికి నెల చదును చేసే పనులు ప్రారంభమైనప్పటికీ అసలు పునాది నిర్మాణం ప్రారంభం కాలేదు. ఇది ఈ నెలలోనే ప్రారంభమవుతుందని సమాచారం. ఆలయ ఖర్చు 1,100 కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో ప్రధాన ఆలయానికి ₹ 300 కోట్ల నుండి ₹ 400 కోట్లు మరియు మిగతాది 67 ఎకరాల అభివృద్ధి పనులకు ఖర్చు అయ్యే అవకాశం ఉందంట.
ఈ పని మొత్తం మూడు, మూడున్నర సంవత్సరాలలో పూర్తయ్యే అవకాశం ఉంది. దేశంలోని అన్ని మూలల నుండి ప్రజలు భారీ సంఖ్యలో విరాళాలు ఇస్తున్నారు. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేయడానికి శ్రీ రామ్ జన్మభూమి మందిర్ నిధి సమర్పాన్ అభియాన్ కు చెందిన వాలంటీర్లు ప్రతి ఇంటి తలుపులు తడుతున్నారు.
బాబ్రీ మస్జీద్ ఉదంతం తరువాత 28 ఏళ్ళ సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం గత ఏడాది వివాదాస్పద భూమిలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ రకంగా ఎన్నో ఏళ్ళ గా ఎంతో మంది హిందువులు కలలుగన్న భవ్యరామ మందిర నిర్మాణం సాకారం అయ్యే దిశగా ముందుకు సాగుతుంది.





