2019 సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో గానీ, ఎన్నికల హడావుడి మాత్రం తెలంగాణా కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతోంది. పాదయాత్ర చేస్తోన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అన్ని విభాగాలలో అపారమైన హామీలను కురిపించగా, మరోవైపు కొత్తగా అధికార పల్లవి పట్టుకున్న జనసేన అధినేత కూడా ప్రజాకర్షక హామీలను కురిపించే పనిలో ఉన్నారు.
[m9ad]
నేడు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో ప్రారంభమైన జనసేన పోరాటయాత్రలో భాగంగా, ఆటోడ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు వరాల జల్లు కురిపించారు. ‘మీరు పడే కష్టాలు తనకు తెలుసన్న పవన్, తాము అధికారంలోకి వస్తే ఆటోడ్రైవర్లకు బాటరీ ఆటోలను సబ్సిడీ రూపంలో అందేలా జనసేన చూసుకుంటుందని’ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి – ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా ఇలా జగన్, పవన్ లు ఒకరిని మించి మరొకరు ప్రజలపై వరాల జల్లు కురిపించే పనిలో ఉంటే, మరోవైపు తాము చెప్పిన కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసామని, అధికార పార్టీ చెప్పుకుంటోంది. టిడిపి, వైసీపీల రాజకీయాలు ప్రజలకు సుపరిచితమే గానీ, కొత్తగా అధికారం కావాలంటున్న పవన్ కళ్యాణ్ పాట్లు మాత్రం ప్రజలకు కొత్త అనుభూతులను పంచుతున్నాయి.





