జనసేనకు ఉన్నది ఆవేశం… లేనిది క్రమశిక్షణ?

Pawan-Kalyan-JanaSena-Discipline

టిడిపి, జనసేనలు తొలి జాబితా విడుదల చేసినప్పటి నుంచి జనసేనలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆ విషయాలన్నీ ఇప్పటికే చెప్పుకున్నాము. కనుక మళ్ళీ వాటి ప్రస్తావన అవసరం లేదు.

ADVERTISEMENT

కానీ జనసేనలో జరుగుతున్నా ఆ రచ్చని చూస్తున్నప్పుడు, తెలంగాణ ఎన్నికలలో టిడిపి శ్రేణులు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించిన తీరు కళ్ళ ముందుకు మెదులుతుంది. ఆ ఎన్నికలలో టిడిపి పోటీ చేసేందుకు సర్వ సన్నాహాలు చేసుకున్న తర్వాత, ఏపీలోని టిడిపి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినప్పుడు బహుశః ఇంతకంటే ఎక్కువే రచ్చ జరిగి ఉండాలి.

కానీ టిడిపిలోకి వచ్చి తెలంగాణ టిడిపి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ ఒక్కరే పార్టీ నిర్ణయంతో విభేదించి వెళ్ళిపోయారు. టిడిపి క్యాడర్ అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఉండిపోయింది తప్ప అభ్యంతరం చెప్పలేదు.

పైగా ఏపీలోని పార్టీ భవిష్య అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ అభ్యర్ధులకు, ముఖ్యంగా ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్ధులకు పూర్తి మద్దతు ప్రకటించి భారీ మెజార్టీతో వారిని గెలిపించుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్య నేతలతో ఒక్క ముక్క చెప్పితే వారు అర్దం చేసుకొని ఆయనకు సహకరించారు. తెలంగాణలో టిడిపి ఏపీలో టిడిపి కోసం క్రమశిక్షణ కలిగిన సైన్యంలా పనిచేసింది.

తాజాగా ఏపీ శాసనసభ ఎన్నికలకు టిడిపి ప్రకటించిన తొలి జాబితాలో పలువురు సీనియర్లు పేర్లు లేనప్పటికీ, ఎవరూ మీడియా ముందుకు వచ్చి రచ్చరచ్చచేయడం లేదు. జనసేన, బీజేపీలతో పొత్తుల వలన కొన్ని సీట్లు త్యాగాలు చేయాల్సివస్తే చేయక తప్పదని, వైసీపిని ఓడించి టిడిపి, జనసేనలు అధికారంలో రావడమే ముఖ్యమని చెపుతున్నారు.

ఇక జనసేన విషయానికి వస్తే, తెలంగాణలో 32 స్థానాలకు పోటీ చేద్దామని అనుకున్నారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాలలోనే పోటీ చేశారు. ఆ 8 స్థానాలలో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదు! జనసేనకు 32 స్థానాలకు బదులు కేవలం 8 స్థానాలే లభించినా వాటిలో ఏ ఒక్కటీ గెలిపించుకోలేకపోవడం పవన్‌ కళ్యాణ్‌కి, వారికీ అవమానం కాదా?

క్రమశిక్షణారాహిత్యం వలన నష్టపోయేది మనమే అని తెలిసి ఉన్నప్పటికీ ఏపీలో జనసైనికులు, శ్రేయోభిలాషుల ముసుగులో మరికొందరు తమ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని బహిరంగంగా వెళ్ళగ్రక్కేస్తున్నారు. టిడిపి, జనసేనలను, ముఖ్యంగా… పవన్‌ కళ్యాణ్‌ని అవహేళన చేస్తున్న సాక్షి మీడియాకు వెళ్ళి కొందరు మాట్లాడేస్తున్నారు.

ఈవిదంగా వ్యవహరిస్తూ ఎన్నికలకు ముందు పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేక, చులకన భావన కలిగించుకుంటున్నామనే స్పృహ లేకుండా వ్యవహరిస్తూ కూర్చోన్న కొమ్మనే నరుక్కొంటున్నారు. జనసైనికుల ఈ వీక్‌నెస్ వైసీపికి బాగా తెలుసు. కనుక అది కూడా తెలివిగా వారిని రెచ్చగొడుతూ పార్టీని, కూటమిని వారి చేతే దెబ్బతీయించేందుకు చివరి ప్రయత్నం చేస్తోంది.

వైసీపి కుట్రలు, కుతంత్రాల గురించి పవన్‌ కళ్యాణ్‌కు బాగా తెలుసు. అందుకే తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోయేది ప్రకటించకుండా గోప్యత పాటిస్తున్నారు. అది చూసిన్నప్పుడైనా జనసైనికులకు, వారి శ్రేయోభిలాషులకు తాము హద్దులు దాటి పార్టీకి నష్టం చేసుకుంటున్నామని గ్రహిస్తే బాగుండేది.

ఒకవేళ గ్రహించలేకపోతే జనసేన స్వయంగా లిఖిత పూర్వకంగా హెచ్చరిస్తున్నప్పుడైనా తెలుసుకొని క్రమశిక్షణ పాటిస్తేనే వారి పార్టీ, వారి ప్రియతమ నాయకుడు శాసనసభలో అడుగుపెట్టగలరు. కానీ వద్దనుకునేవారే ఇలాగే ప్రవర్తిస్తారు.

ADVERTISEMENT
Latest Stories