వెబ్ మీడియాకు సంబంధించిన రికార్డులన్నీ మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150”తో కనుమరుగు కాగా, వాటిల్లో కొన్ని రికార్డులను బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” బద్దలు కొట్టాడు. అయితే అసలు యూ ట్యూబ్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా పిలుచుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” ద్వారా మరోసారి రంగప్రవేశం చేయబోతున్నాడు. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆడియో ఆల్బమ్ లో తొలి పాట ఈ శుక్రవారమే ప్రేక్షకులకు వినిపించనుంది.
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ‘టైటిల్’ సాంగ్ ను తొలిపాటగా చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది. ఇక, సినిమా షూటింగ్ సంగతులకు వస్తే… మార్చి 4వ తేదీ నుండి పవన్ కళ్యాణ్, శృతిహాసన్ లపై రెండు పాటలను యూరోప్ లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 18వ తేదీన ఏర్పాటు చేయాలని, సినిమాను 24వ తేదీన విడుదల చేయాలన్నది ప్రస్తుతానికి ఉన్న ప్లానింగ్. ఒక్కసారి పాటల చిత్రీకరణ పూర్తయితే, అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు.



