‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. వీరిద్దరి కాంభినేషన్ లో ఇప్పటికే “జల్సా, అత్తారింటికి దారేది” సినిమాలు ఉండడంతో, ట్రేడ్ వర్గాలలో క్రేజీ కాంభినేషన్ గా మారింది. ఈ రెండు సినిమాలు కూడా పవన్ కు కావాల్సిన టైంలో మంచి బ్రేక్ నిచ్చాయి. ఒకటి సూపర్ హిట్ గా నిలువగా, మరొకటి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టింది. దీంతో ‘హ్యాట్రిక్’ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
వీరిద్దరి కలయికలో మూడవ సినిమా కాగా, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది 23వ సినిమా. ఇటీవల విడుదలైన “కాటమరాయుడు” సినిమాతో 22 సినిమాలను పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్, 23వ సినిమాగా దీనిని సెట్స్ పైకి తీసుకువెళ్లారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై మరో ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సిల్వర్ జూబ్లీ’ సినిమాగా ఇది విడుదల కానుందని, పవన్ 25వ సినిమాకు సరైన దర్శకుడే బరిలోకి దిగారని చెప్తూ… ‘పీ.ఎస్.పీ.కే 25’ అని ప్రచారం జరుగుతోంది.
లెక్క ప్రకారం 23 కావాల్సింది 25 ఎలా అయ్యిందో అర్ధం కాని పరిస్థితి. మధ్యలో ‘జిల్లా’ ఫేం తమిళ దర్శకుడు తెరకెక్కించబోయే సినిమాకు పూజా కార్యక్రమాలు జరిపారు గానీ, అది రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. అలాగే ఇటీవల కూడా ఓ సినిమా ప్రకటించారు గానీ, అది కూడా ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది. వీటన్నింటి కంటే ముందే త్రివిక్రమ్ సినిమా విడుదల కావడం పక్కా. బహుశా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే తమ అభిమాన హీరో 25వ సినిమా చేయాలనే తలంపుతో అభిమానులు ఈ విధంగా షేర్ చేసుకుంటున్నారేమో గానీ, షూటింగ్ ప్రారంభమైన ఫస్ట్ డేనే ఈ సినిమా నెటిజన్లకు కావాల్సిన ఆహారాన్ని అందించింది.



