ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఆయనకు కనీవినీ ఎరుగని స్థాయిలో జగన్ ప్రభుత్వం స్వాగత సత్కారాలను ఏర్పాటు చేస్తోంది. వాలంటీర్లను ఇంటింటికీ పంపించి ‘రేపు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరుగబోయే మోడీ సభకు రావలసిందిగా ప్రజలను ఆహ్వానిస్తోందంటే’ మోడీ పర్యటనను జగన్ ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకొందో అర్దం చేసుకోవచ్చు.
జగన్ ప్రభుత్వం చేస్తున్న ఈ హడావుడిని చూసి రాష్ట్ర బిజెపి నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది తమ అధినేత సభా లేక వైసీపీ ప్లీనరీ సభా అని ప్రశ్నిస్తున్నారు. మోడీ పర్యటనను జగన్ ప్రభుత్వం హైజాక్ చేసిందని సోమూ వీర్రాజు చెప్పుకోవడం బిజెపికి సిగ్గుచేటే కానీ ఇది వాస్తవం.
జగన్ ప్రభుత్వం ఇంత హడావుడి ఎందుకు చేస్తుందో అందరికీ తెలుసు కనుక మళ్ళీ చెప్పుకోనవసరం లేదు. ఇంత హడావుడి చేస్తున్నందుకు, ఈరోజు రాత్రి చోళ కళింగలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రులకు, కనీసం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారని ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా తాము ఎంతగానో ద్వేషిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి అపాయింట్మెంట్ ఇవ్వడం పుండు మీద కారం చల్లినట్లే ఉంది వైసీపీ నేతలకి.
ఈరోజు రాత్రి 8.30 గంటలకు లేదా రేపు ఉదయం 7.00 గంటలకు ఐఎన్ఎస్ చోళ కళింగలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యేందుకు అందుబాటులో ఉండాలని ప్రధాని కార్యాలయం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి సందేశం వచ్చింది. కనుక పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రమే విశాఖకు చేరుకోబోతున్నారు.
గత నెల పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వస్తే ఆయనని రెండు రోజులపాటు హోటల్ గదిలో నుంచి బయటకు రానీయకుండా పోలీసులతో నిర్బందింపజేసి బలవంతంగా వెనక్కు తిప్పింది జగన్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు విశాఖకు వస్తున్న పవన్ కళ్యాణ్ అడ్డుకొనే సాహసం చేయలేదు. పైగా ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కోసం ఆయనకు సహకరించవలసివస్తోంది. జగన్ ప్రభుత్వానికి ఇది పైకి చెప్పుకోలేని పైల్స్ నొప్పి వంటిదే కానీ భరించక తప్పదు.
పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయితే ఏం చెపుతారో తేలికగానే ఊహించవచ్చు. తనను విశాఖలో నిర్బందించడం, ఇప్పటంలో ఇళ్ళ కూల్చివేత, జనసేనతో కలిసి పనిచేయడానికి ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు నిరాసక్తి చూపడం వంటి అంశాలను పవన్ కళ్యాణ్ తప్పక ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళడం ఖాయం. ఒకవేళ ప్రధాని నరేంద్రమోడీ సమయం ఇస్తే రైతుల పాదయాత్ర, వారిపై వైసీపీ నేతల దాడులు, మూడు రాజధానుల పేరుతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం మొదలు రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలను పూసగుచ్చిన్నట్లు వివరించవచ్చు. కానీ ప్రధాని నరేంద్రమోడీ బహుశః పవన్ కళ్యాణ్‌కి అంత సమయం ఇవ్వకపోవచ్చు.
ప్రధానంగా పవన్ కళ్యాణ్‌కి బిజెపితో కలిసి పనిచేయాలనే ఆసక్తి ఉందా లేదా? చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తాననే పవన్ కళ్యాణ్ ప్రకటనపై వివరణ కోరవచ్చు. కనుక ఈ సమావేశం తర్వాత బిజెపి, జనసేన పొత్తులపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్రమోడీ-పవన్ కళ్యాణ్ సమావేశాన్ని జగన్ ప్రభుత్వం జీర్ణించుకోవడం చాలా కష్టమే కానీ ఇది బెడిసికొడితే తప్పక సంతోషిస్తారని చెప్పవచ్చు.



