ఎన్డీయే సమావేశంలో అదే చర్చించారట… అందుకేగా పిలిచింది!

Pawan-Kalyan-NDA-Meeting-TDPమంగళవారం ఢిల్లీలో జరిగిన బిజెపి మిత్రపక్షాల (ఎన్డీయే) సమావేశానికి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన తెలుగు మీడియాతో మాట్లాడుతూ, “ఈ సమావేశంలో ప్రధానంగా మళ్ళీ కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడం గురించే చర్చించారు. రాష్ట్ర స్థాయిలో పొత్తుల గురించి ఎటువంటి చర్చ జరగలేదు. గతంలో భారత్‌పై ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు దేశానికి బలమైన నాయకత్వం అవసరమనే మేము మోడీ నాయకత్వంలో బిజెపికి మద్దతు ఇచ్చాము.

ఆయన నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందింది. టిడిపి-బిజెపిల మద్య కొంత గ్యాప్‌ ఏర్పడింది. దానిని అవి పూడ్చుకొంటాయనే ఆశిస్తున్నాను,” అంటూ ఏపీలో జగన్ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి మరోసారి వివరించి, వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు.

ADVERTISEMENT

రాష్ట్ర స్థాయిలో పార్టీలు పొత్తులు పెట్టుకొన్నప్పుడు అవి రాష్ట్ర స్థాయిలో అధికారంలోకి రావడం గురించే ఆలోచిస్తాయి తప్ప కేంద్రంలో ఏవిదంగా అధికారం చేజిక్కించుకోవాలని ఆలోచించవు. అదేవిదంగా జాతీయస్థాయిలో పార్టీలు కలిసి కూటమి ఏర్పాటు చేసుకొన్నప్పుడు వాటి టార్గెట్ కేంద్రంలో అధికారంలోకి రావడమే.

నిన్న బెంగళూరులో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు కలిసి సమావేశమయ్యి కొత్తగా ‘ఇండియా’ పేరుతో కూటమి ఏర్పాటు చేసుకొన్నా, నిన్న ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశం రెండూ కూడా కేంద్రంలో అధికారంలోకి రావడం కోసమే. అందుకే ఎన్డీయే సమావేశంలో ఏపీలో రాజకీయాలు, పొత్తుల గురించి చర్చించలేదు. చర్చిస్తారని ఆశించడం కూడా అనవసరం.

వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా టిడిపికి లేదంటూ సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు పదేపదే చేస్తున్న విమర్శలకు టిడిపి ధీటుగా జవాబు చెప్పకపోవడం వలన ప్రజలకు కూడా టిడిపి పట్ల అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కనుక టిడిపి ఎంత త్వరగా ఈ ‘బిజెపి భ్రమ’ నుంచి బయటపడగలిగితే అంత దానికే మంచిది.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు, నియోజకవర్గాల స్థాయిలో టిడిపి నేతలకు లభిస్తున్న ప్రజాధారణ చూస్తే ఈసారి ప్రజలు టిడిపి వెంటే నడిచేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికలలో గెలిచేందుకు వైసీపీ వ్యూహాల పేరుతో చేస్తున్న కుట్రలను టిడిపి బాగానే గుర్తించింది. వాటిని ఏవిదంగా ఎదుర్కోవాలో నిర్ణయించుకొని ముందుకు సాగితే చాలు. టిడిపి సొంత బలంతోనే వైసీపీని ఎదుర్కొని విజయం సాధించి అధికారంలోకి రాగలిగితే చాలా హుందాగా ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories