నిజజీవితంలో పవన్‌ ద్విపాత్రాభినయం… హిట్ కొట్టడం కష్టమే

Pawan Kalyanపవన్‌ కళ్యాణ్‌ సినిమాలలో ఇంతవరకు డబుల్ రోల్ చేయలేదు కానీ నిజజీవితంలో మాత్రం డబుల్ రోల్ చేస్తున్నారు. ఒకటి సినీ నటుడుగా మరొకటి రాజకీయనాయకుడుగా. ఆయన రెంటిలోను బాగానే రాణిస్తున్నారు. కానీ ఒక పాత్ర వలన రెండో పాత్రకు నష్టం జరుగుతోంది.

ADVERTISEMENT

సినిమాల వలన వచ్చిన స్టార్ ఇమేజ్‌ ఆయనకు రాజకీయాలలో బాగానే ఉపయోగపడుతోంది. కానీ రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించలేకపోవడం వలన ఆయనలో సీరియస్‌నెస్ లేదనే భావన చాలమందిలో ఉంది. జనసేనను నడిపించడానికి అవసరమైన డబ్బు సంపాదించేందుకే తాను సినిమాలు చేయవలసి వస్తోందని పవన్‌ కళ్యాణ్‌ చెపుతున్న మాటలు నిజమే. కానీ ఓ రాజకీయపార్టీని నడిపించేతీరు ఇది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

దాదాపు ఒకటిన్నర నెలలు వారాహి యాత్రలతో ప్రజల మద్య తిరిగిన పవన్‌ కళ్యాణ్‌, పెండింగులో పెట్టిన తన సినిమాలను పూర్తి చేసేందుకు, రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకొన్నారు. సెప్టెంబర్‌ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. వీలైతే దాంతో పాటు ఓజీ, హరిహరవీరమల్లు సినిమాలను కూడా పూర్తిచేయాలని నిర్ణయించుకొన్నారు.

వీటి కోసం కనీసం రెండు, మూడు నెలలు సమయం కేటాయించవలసి ఉంటుంది. అప్పుడు కానీ అవి పూర్తికావు. అంటే అప్పటి వరకు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించలేరన్న మాట! ఇదెలా ఉందంటే, కొలిమిలో ఇనుము ఎర్రగా కాలి సుత్తిదెబ్బలకు సిద్దమైనప్పుడు తీసి నీళ్ళలో ముంచిన్నట్లే ఉంది.

వారాహి యాత్రలతో జనసేనలో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రజల మద్య తిరుగుతుండటంతో ప్రజలు కూడా ఆయన గురించి ఆలోచించటం మొదలుపెట్టారు. ఇదీగాక బిజెపితో సీట్ల సర్దుబాట్ల గురించి చర్చించాల్సి ఉంది. అలాగే టిడిపితో పొత్తు పెట్టుకోవాలా వద్దా? పెట్టుకొంటే రెండు పార్టీలు సీట్లసర్దుబాట్లు ఎలా చేసుకోవాలి?అనేవి తేల్చుకోవలసి ఉంది.

కానీ ఇటువంటి సమయంలో పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ ప్రజలు, పార్టీ మద్య నుంచి మాయం కాబోతున్నారు. ఈ పద్దతిలో రాజకీయాలలో రాణించగలమా? అనుకొన్న లక్ష్యాలు సాధించగలమా? అని పవన్‌ కళ్యాణ్‌, జనసేన నేతలే ఆలోచించుకోవలసి ఉంటుంది.

ఇక పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ నాయకుడి పాత్ర వలన అటు నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. సినిమా షూటింగ్‌ చేయాలంటే బోలెడంత డబ్బు ఖర్చు, వివిద ప్రాంతాలలో అనుమతులు తీసుకోవడం, ఆయా ప్రాంతాలలో హోటల్స్ బుకింగ్ చేసుకోవడం, విదేశాలలో అయితే స్థానిక జూనియర్ ఆర్టిస్టులను ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా సినిమాలో మిగిలిన నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం ఇలా చాలా తతంగం ఉంటుంది. కనుక షూటింగ్‌ మొదలుపెట్టి మద్యలో ఇలా బ్రేక్ తీసుకొని వెళ్లిపోతే అంతా గందరగోళం అవుతుంటుంది.

ఇక జనసేన అధినేతగా పవన్‌ కళ్యాణ్‌ జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, తీవ్ర ఆరోపణలు కూడా సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతే కాదు… పవన్‌ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తున్నవారికి కూడా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తోంది. సినిమా మొదలుపెట్టినప్పుడు నటీనటులు, దర్శకులు, ఇతర సిబ్బందిలో, అలాగే అభిమానులలో ఉండే ఉత్సాహం నెలల తరబడి సినిమా వాయిదాపడితే క్రమంగా తగ్గిపోతుంది. అది కూడా సినిమాపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి.

నందమూరి బాలకృష్ణ కూడా ఇలాగే ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఆయన టిడిపిని నడిపించడం లేదు కనుక సినిమాలకు పూర్తి సమయం కేటాయించగలుగుతున్నారు. ఆయన సినిమాలు చేసుకొంటునప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని టిడిపి చూసుకోంటోంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఇటువంటి వెసులుబాటు లేదు.

కనుక నిజజీవితంలో చేస్తున్న ఈ ద్విపాత్రాభినయం వలన ఇటు సినిమాలలో, అటు రాజకీయాలలో కూడా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక ఈ సమస్యకు పవన్‌ కళ్యాణ్‌, ఆయనతో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు, జనసేన పార్టీ నేతలే ఆలోచించుకొని శాస్విత పరిష్కారాలు కనుగొనవలసి ఉంటుంది. లేకుంటే అందరూ కలిసి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories