నేడు ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెరిచిన పుస్తకం వంటి ఆయన రాజకీయ జీవితంలో కొన్ని పేజీలు ఓసారి చూద్దాం.
చిరంజీవి ‘రాజ్య ప్రయోగం’ విఫలమైన తర్వాత పవన్ కళ్యాణ్ ‘సేన’తో ప్రజల ముందుకు రావడం దుస్సాహసమే. కనుక జనసేన కూడా ‘ఓపెన్ అండ్ షట్ కేసు’లా కొన్ని నెలల్లో మూతపడుతుందని రెండు రాష్ట్రాలలో ప్రత్యర్ధులు ఎద్దేవా చేశారు. కానీ ఓపికగా, ధైర్యంగా సమస్యలను, సవాళ్ళను, అవమానాలను.. అన్నిటినీ భరిస్తూ ధైర్యంగా నిలబడి నేడు ఈ స్థాయికి ఎదిగారు. నాడు అవహేళన చేసినవారి పరిస్థితి తారుమారు కాగా, నేడు ఆయన ఎదుగుదల చూసి అసూయతో రగిలిపోతున్నారు.
కొన్ని తప్పతడుగులకు పవన్ కళ్యాణ్ ఏవిధంగా భారీ మూల్యం చెల్లించారో, అదేవిధంగా కొన్ని స్థిరమైన నిర్ణయాలకు సత్ఫలితాలు కూడా పొందారు. మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. తనతో కలిసి నడిచిన జనసేన నాయకులకు కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవులు దక్కేలా చేశారు.
పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని నాడు ప్రగల్భాలు పలికినవారు, నేడు లోనికి వచ్చేందుకు భయపడుతుంటే, డెప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్ శాసనసభలో కూర్చోంటున్నారు.
అయితే పదవి, అధికారం తాను అనుభవించడానికి కాదు.. తనను నమ్మి గెలిపించిన ప్రజలకు సేవ చేయడానికని మనసా వాచా నమ్మే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఏజన్సీ ఏరియాలో మారుమూల గ్రామాలకు చక్కటి తారురోడ్లు వేయించి, అవసరమైన ప్రాధమిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఈ రెండేళ్ళలో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అభివృద్ధి పనులు వేగవంతం చేసినందుకు ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటే, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజలకు చేరువవుతూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు.
అయితే అంతా ఓకేనా? ఇక తిరుగులేదా? అంటే కాదనే చెప్పాలి. ఈ స్థాయికి చేరుకున్నాక పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యానికి గురవుతుండటం సరికాదు.
రాజకీయాలలో ఉన్నవారు తప్పనిసరిగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి కాపాడుకోవాలని ప్రధాని మోడీ సూచన అక్షరాల నిజం. ప్రధాని మోడీ మాటల్లో చెప్పిన ఈ విషయాన్ని, సిఎం చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా ఆచరణ చేసి చూపిస్తున్నారు కదా? కనుక పవన్ కళ్యాణ్ కూడా తన ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
సనాతన ధర్మ పరిరక్షణ, తెలంగాణలో జనసేనని బలోపేతం చేసుకోవడం మంచిదే. కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు, అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రాలో జనసేనని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. పునాది బలంగా ఉంటే దానిపై ఎంత పెద్ద భవనమైన నిర్మించుకోవచ్చు.
కాదని కేసీఆర్‌లా ఆవేశపడటం మంచిది కాదు. కనుక జనసేనాని వేసే ప్రతీ అడుగు రాష్ట్రాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి ఉపయోగపడాలి తప్ప ఊహించని కొత్త సమస్యలకు దారి తీసేలా ఉండకూడదు.
పవన్ కళ్యాణ్‌పైకి చాలా ఆవేశంగా మాట్లాడినా ఇలాంటి విషయాలన్నీ ఆయనకు బాగా తెలుసు. కానీ రాజకీయ ప్రవాహంలో పయనిస్తున్నప్పుడు చిన్నచిన్న విషయాలు మరిచిపోవచ్చు. కనుక శ్రేయోభిలాషుల నుంచి ఇటువంటి రిమైండర్స్ సానుకూలంగా స్వీకరిస్తే మంచిదే.





