ముందరి కాళ్ళకు బంధం..!

Pawan Kalyan Ram Charan Bondingసుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన “రంగస్థలం” సినిమా అపూర్వమైన విజయాన్ని నమోదు చేసుకుంది. సుకుమార్ అద్వితీయమైన ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమాలో మొదటిసారిగా రామ్ చరణ్ నటనా కౌశల్యం కూడా మాట్లాడుకునేలా చేసింది. నిజమే… ఒక్క అభిమానులనే కాదు, సినీ విమర్శకులను కూడా చెర్రీ తన అభినయంతో ఫ్లాట్ చేసాడు. అందులో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రమోషన్ ఈవెంట్ నుండి తాజాగా జరిగిన విజయోత్సవ వేడుక వరకు అన్నింటిలో ప్రధానంగా వినపడిన మాట ఏమైనా ఉందంటే… అది అవార్డుల గురించే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి జాతీయ అవార్డులు వస్తాయని ఆశిస్తున్నానని, రాకపోతే అది అన్యాయం జరిగినట్లేనని ప్రస్తావించిన మాటలు అందరికీ తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ‘ఆస్కార్’కు పంపించకపోతే అన్యాయం అంటున్నారు.

ADVERTISEMENT

పరోక్షంగా ‘మెగా’ వర్గం ఏం చెప్పదలుచుకుందంటే… ఈ సారి ‘రంగస్థలం’ సినిమాకు అవార్డులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నట్లుగా కనపడుతోంది. ఎందుకంటే… గతేడాది ఏపీ సర్కార్ నంది అవార్డులను ప్రకటించిన సమయంలో ‘మెగా’ కాంపౌండ్ వేదికగా రేగిన అసంతృప్తి జ్వాలలు బహిరంగమే. బన్నీ వాసు, నల్లమలపు బుజ్జి, బండ్ల గణేష్ తదితరులు ‘మెగా’ సినిమాలకు అవార్డులు రాలేదని మీడియాలకెక్కి చేసిన రచ్చ విదితమే.

దీంతో ‘రంగస్థలం’ సినిమాకు అవార్డులు ఇవ్వాల్సిందేనని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా కనపడుతోంది. అసలు వాస్తవ పరిస్థితులకు వస్తే… నిజమే ‘రంగస్థలం’లో అందరూ అవార్డ్ విన్నింగ్ ప్రతిభనే ప్రదర్శించారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అవార్డులు ఇచ్చే ముందు ఒక ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాలన్నీ పరిశీలిస్తారు. దీని కంటే మరొకరు ఓ మెట్టు పైన నిలబడితే, ఖచ్చితంగా అవార్డులు వాళ్ళకే వెళ్తాయి. దానిని కూడా అన్యాయం అంటే మళ్ళీ విమర్శలు మూటకట్టుకోవాల్సి ఉంటుంది.

అయినా అవార్డులు అనేవి డిమాండ్ చేస్తే ఇచ్చేవి కావు. అలాగే ముందస్తు హెచ్చరికలు, బెదిరింపులు చేస్తే వచ్చేవి అంతకంటే కాదు. దానికి ఓ కొలమానం ఉంటుంది. ముందుగా ఆశించి భంగపాటుకు గురికావడం కంటే, అవార్డులు వచ్చిన తర్వాత సంతోషించడం మెరుగన్న విషయం చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద మనుషులకు తెలియనిదా? అయితే ఈ సారి టార్గెట్ అయితే మిస్ కాకూడదన్నది ‘మెగా’ ఆలోచనలుగా వినపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories