మనుషుల మధ్య పెరుగుతున్న దూరం దేనివల్ల?

Smartphones and Family Relationships

ల్యాండ్ లైన్ ఫోన్ల జమానాలో ఫోన్ కాల్ వస్తే ఇంట్లో అందరూ దాని చుట్టూ చేరేవారు. అవతలి వ్యక్తి కుటుంబ సభ్యులో, లేదా బంధుమిత్రులో అయితే ఇంట్లో అందరూ మాట్లాడేందుకు ప్రయత్నించేవారు.

ఆ జమానాలో ఉత్తరాలు కూడా అనేక భావోద్వేగాలు, ఇంకా బోలెడంత సమాచారాన్ని మోసుకొచ్చేవి. అందరూ వాటిని పంచుకొనేవారు.

ADVERTISEMENT

కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాక అటువంటి పరిస్థితి లేదు. భార్య భర్తలు, తల్లితండ్రులు-పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరి ఫోన్లు వారివే. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఫోన్ వస్తే వారు కుటుంబ సభ్యులు నలుగురి మధ్యలో కూర్చొని మాట్లాడలేకపోతున్నారు. తప్పనిసరిగా పక్కకు వెళ్ళి మాట్లాడుకోవాల్సిందే.

నిజానికి ల్యాండ్ లైన్ ఫోన్లు అయినా మొబైల్ ఫోన్లు అయినా ప్రాంతాలు, దేశాలు, సరిహద్దులు వంటి దూరాలు చేరిపెసి ఒకరినొకరికి దగ్గర చేసేవే కదా?

కానీ ల్యాండ్ స్థానంలో మొబైల్ ఫోన్స్ రావడం వలన మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. ఎందువల్ల? మొబైల్ ఫోన్ వల్లనా లేక మానవ సంబంధాలు బలంగా లేకపోవడం వలనా? లేక మనుషుల ఆలోచనా విధానం మారడం వలనా? అంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ల వలన కాదని అందరికీ తెలుసు.

కాలక్రమంలో లేదా తరాలతో బాటు మనుషుల ఆలోచనావిధానంలో మార్పులు రావడం సహజం. అయితే మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మార్పు మరింత వేగవంతమైంది.

అయితే మొబైల్ ఫోన్ కేవలం ఒక పరికరం మాత్రమే. కానీ మనషుల మద్య అదే దూరం పెంచిందంటూ అందరూ దానినే నిందిస్తుంటారు తప్ప మన ఆలోచనా విధానంలోనే మార్పు వచ్చిందని అంగీకరించడానికి చాలా మంది ఇష్టపడరు.

ఒకప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనాలు చేసేవారు. కలిసి కబుర్లు చెప్పుకునేవారు. మధ్యతరగతి కుటుంబాలలో అందరూ చిన్న చిన్న ఇళ్ళలో సర్దుకుపోయి జీవిస్తుండేవారు. బొత్తిగా సౌకర్యాలు లేని అలాంటి ఇళ్ళల్లో, అలాంటి పరిస్థితులలో కూడా అందరూ సంతోషంగానే జీవించేవారు.

కానీ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలలో కూడా తల్లితండ్రులకు తప్ప ప్రతీ ఒక్కరూ ప్రైవసీ కావాలని, కుదిరితే ప్రత్యేకంగా ఓ గది.. దాని తలుపులు వేసుకొని ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందువల్ల?

ఇంట్లోనే ఉన్న కుటుంబ సభ్యులకు దూరంగా, ఎక్కడో ఉన్న స్నేహితులను, అపరిచితులను ఆత్మీయులుగా భావిస్తూ వారితోనే ఆ ఆ గదిలో ఒంటరిగా కాలక్షేపం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. లేదా సోషల్ మీడియా ప్రపంచంలోకి వెళ్ళిపోతుంటారు. మనుషులు ఈవిధంగా ఎందుకు మారిపోయారు?

ఇప్పుడు అవసరానికి మించిన ఆదాయం, సకల సౌకర్యాలతో కూడిన విశాలమైన ఇల్లు, ఫోన్లో ఆర్డర్ పెడితే టిఫిన్లు, భోజనాలు, పపుప్పులు, కూరగాయలు అన్నీ ఇంటి గుమ్మం వద్దకే వచ్చేస్తున్నాయి. అయినా చాలా మంది సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందువల్ల?

సకల సౌకర్యాలతో సుఖంగా జీవించడమే ‘సంతోషం’ అని అనుకుంటున్నారు. ఇంట్లో సుఖంగా (సంతోషంగా) జీవిస్తున్నప్పుడు మళ్ళీ ఆ సంతోషాన్ని (ఎంజాయ్) వెతుక్కుంటూ బైకులు, కార్లు వేసుకొని ఎక్కడెక్కడికో ఎందుకు తిరుగుతుంటారు? అనే ప్రశ్నలకు అందరి సమాధానాలు ఒక్కలా ఉండవు. కనుక ఎవరికీ వారు ప్రశ్నించుకుని సమాధానాలు, ఈ సమస్యకు మూల కారణాలు కనుగొనవలసిందే.

ADVERTISEMENT
Latest Stories