పవన్‌ వస్తున్నాడు… రోజా, అంబటి, గుడివాడ అందరూ రెడీయా?

Pawan-Kalyan-To-visit-Crop-Loss-Farmersజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బుదవారం ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించి అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శిస్తారని ఆ పార్టీ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. పవన్‌ కళ్యాణ్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపింది.

పవన్‌ కళ్యాణ్‌ వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిసినా లేదా ఏపీలో పర్యటనకు వస్తున్నా జనసేన కంటే ముందే వైసీపీ మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్ , ఎమ్మెల్యే కొడాలి నాని వంటికొందరు తమ నోటికి పదును పెట్టుకొని విమర్శలు చేయడానికి సిద్దంగా ఉంటారు. పవన్‌ కళ్యాణ్‌ వారికి ఎన్నిసార్లు చురకలు వేసినా మళ్ళీ విమర్శలకు సిద్దం అవుతుంటారు. పవన్‌ కళ్యాణ్‌ ఉభయ గోదావరి జిల్లాలో పర్యటనకు వస్తున్నారు కనుక వీరికి నోటి నిండా పనే!

ADVERTISEMENT

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకొంటుంటే, ఓ మంత్రి రైతులను ‘ఎర్రిపప్పా నోర్మూయ్,” అంటారు. మరో మంత్రి “రాత్రి తుఫాను వస్తే మర్నాడు ఉదయమే నష్టపరిహారం ఇవ్వలేము కదా?” అని వితండవాదం చేస్తారు తప్ప ఇంతవరకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోనేలేదు.

తక్షణం ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేకుంటే తాను నిరసనదీక్ష చేపడతానని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా రైతులను పరామర్శించడానికి వస్తున్నారు కనుక, వారిద్దరూ కలిసి తమ ప్రభుత్వంపై బురద జల్లెందుకే ఈ కుట్ర చేస్తున్నారని ‘వైసీపీ ఫిరంగులు’ గర్జించడం ఖాయం. పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ గ్యాప్‌లో ఏపీకి వచ్చి రైతులను పరామర్శించి డ్రామాలు ఆడుతున్నారని మంత్రి రోజా విమర్శించడం ఖాయం.

అయితే ప్రతిపక్షాలకు ఈ అవకాశం ఇస్తున్నదే జగన్ ప్రభుత్వం కదా?ప్రతిపక్ష నేతలను తిట్టిపోసేబదులు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రైతులను కలిసి ఓదార్చవచ్చు. ప్రభుత్వం, అధికారం, యంత్రాంగం, ఆర్ధిక వనరులు అన్ని తమ చేతుల్లోనే ఉన్నాయి కనుక దీనికీ ఓ ‘ప్రత్యేక బటన్’ ఏర్పాటు చేసుకొని నొక్కి నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవచ్చు కదా?

ADVERTISEMENT
Latest Stories