ఓ సినిమా లేదా హీరోహీరోయిన్లని చాలా మంది అకారణంగా ద్వేషిస్తుంటారు. అలా ద్వేషించాడానికి బలమైన కారణమంటూ ఉండదు. సినీ పరిశ్రమలో వ్యక్తులు, బ్యానర్ల మద్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది కనుక వారు పరస్పరం ద్వేషించుకోవడం ఒకరినొకరు దెబ్బ తీసుకోవడం సహజం.
కానీ అభిమానులు తమ హీరోపై వీరాభిమానంతో మరో హీరోని ద్వేషించడమే విడ్డూరంగా ఉంటుంది. తమ అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయితే వారు ఎంతగా బాధ పడతారో వేరే హీరో సినిమా ఫ్లాప్ అయినప్పుడు అతని అభిమానులు కూడా అంతే బాధ పడతారని వారి బాధతో తాము సంతోషపడటం అంటే పైశాచిక ఆనందమే కదా? ఇది సబబేనా? అని ఆలోచిస్తే ఎవరూ ఎవరినీ ద్వేషించరు.
ఓజీ సక్సస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ ఇదే చెప్పారు. అభిమానులలో ఈవిదమైన ద్వేష భావనలు చాలా వికృతంగా కనిపిస్తున్నాయన్నారు. వేర్వేరు రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు, కులమతాలకు చెందిన తామందరం సినిమాలలో కలిసి పనిచేస్తుంటే, అభిమానులు మీరెందుకు పరస్పరం కీచులాడుకుంటున్నారని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.
ఒక్కో సినిమా చేసేందుకు తామందరం కుటుంబాలకు దూరంగా నెలల తరబడి రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తుంటే అభిమానులు, రివ్యూలు వ్రాసేవాళ్ళు కలిసి సినిమాలను ఎందుకు చంపేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కోట్ల రూపాయలు పెట్టుబడితో తీసే సినిమాలని దురాభిమానంతో లేదా రివ్యూలతో చంపేయడం సబబేనా? అని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు.
తాను రాజకీయంగా వ్యతిరేకించే నటులతో కూడా సినిమాలలో కలిసి పని చేస్తున్నానని, సినిమాలు, కళలు అందరినీ కలిపేవే తప్ప విడగొట్టేవి కావన్నారు. కనుక అభిమానులు ఇతర హీరోల సినిమాలకు నష్టం కలిగించవద్దని అన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరో మాట కూడా అన్నారు. రాజకీయాలలో సక్సస్ అయిన తర్వాత తనకు సినిమాలపై మోజు తగ్గిందని, కానీ సుజీత్, తమన్ వంటివారందరూ కలిసి ఓజీతో మళ్ళీ సినిమాలు చేయాలనే తపన తనలో కలిగించారని అన్నారు. ఓజీ సక్సస్ చూసిన తర్వాత తప్పకుండా దీనికి సీక్వెల్, ఫ్రీక్వెల్ చేద్దామని చెప్పారు.
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి వెళ్ళి అక్కడా విజయం సాధించిన పవన్ కళ్యాణ్, ఇక సినిమాలు చాలనుకున్నప్పుడు ఆయనలో మళ్ళీ సినిమాలు చేయాలనే తపన కలిగించింది ఓ సినిమాయే కదా?
ఆ స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ అంతటి వాడిని కూడా ఇంతగా ప్రభావితం చేసిన సినిమాలు సామాన్య ప్రేక్షకులను, ముఖ్యంగా అభిమానులను చాలా ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఆ ప్రభావం మంచినే పెంచాలి తప్ప ఇతరులకు, సినిమాలకు, వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న లక్షల మందికి నష్టం కలిగించకూడదు కదా?






