తెలుగుదేశం పార్టీ నుండి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తాజాగా ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రతిపక్ష నాయకుల ఆర్ధిక మూలాల మీద దెబ్బకొట్టి వారిని కాళ్ళ బేరానికి వచ్చేలా చేసుకుంటున్నారని అధికారపక్షం మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయం మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసిన వ్యాఖ్యలు వింతగా ఉన్నాయి.
“మా పార్టీలో గెలిచిన ప్రజా ప్రతినిధులని టీడీపీ చేర్చుకొని మంత్రి పదవులిచ్చిన నీతిలేని మనిషి చంద్రబాబు. అనైతికంగా వైఎస్ జగన్ ఎవరినీ పార్టీలో చేర్చుకోరు. బెదిరించి ఎవరినీ మా పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ విధానాలు నచ్చి చేరతామంటే కాదనే పరిస్థితి లేదు,” అని ఆయన చెప్పుకొచ్చారు.
చేరికలు, ఫిరాయింపులు అనేవి ఎలా జరిగినా అనైతికమే. జస్ట్ కండువా కప్పుకోకుండా ఇండిపెండెంట్ అనే పేరుతో కొత్త పేరు పెట్టారంతే… ప్రభుత్వ విధానాలు నచ్చి చేరుతున్నారంటే అప్పుడు టీడీపీలో చేరిన వారు కూడా అలాగే చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పార్టీలో చేరిన వెంటనే పెండింగ్ లో పెట్టిన ఆయన గ్రానైట్ అమ్మకాల ఫైలు క్లియర్ అయ్యింది.
ఏ పేరుతో చేసినా, ఏ విధంగా సమర్ధించుకున్నా ఫిరాయింపులు, చేరికలు అంతా అనైతికమే. రాజకీయ సర్దుబాటే. ఈ విషయంలో చంద్రబాబుకు గానీ, కేసీఆర్ కి గానీ, జగన్ కు గానీ ఎటువంటి తేడా లేదు. అంతా అనైతికమే. తాము కొత్త పేరుతో చేస్తున్నాం కాబట్టి మేము పతివ్రతలం అని అనుకోకూడదు… చెప్పుకోకూడదు.





