జరుగుతున్న ఆర్ధిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 55,189 కోట్ల అప్పు చేసింది. రమారమీ నెలకు తొమ్మిది వేలకు పైగా అప్పులు చేస్తుంది. బడ్జెట్ లో ఏడాదికి నిర్దేశించుకున్న అప్పులు.. ఆరు నెలలోనే ఖాళీ చేసి ఇప్పుడు దిక్కు తోచకూండా ఉంది. ఏడాది చివరికి లక్ష పది వేల కోట్ల అప్పు చేస్తుందని అంచనా.
అయితే ఈ అప్పులు కూడా సరిపోవడం లేదని మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పడం విశేషం. “ఆంధ్రప్రదేశ్ ఆరేళ్ల వయస్సున్న బాలుడు లాంటింది. తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు కానీ.. బాలుడ్ని చూసి ఇవ్వరు. ఆర్థికంగా చిన్న రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తే ఆశించిన ప్రయోజనాలు చేకూరవు,” అని ఆయన అన్నారు.
నిజమే ఆరేళ్ళ పిల్లాడికి అప్పు దొరకదు. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కూడా… లెక్కకు మించి అప్పులు చేసి ఇంకా చెయ్యడానికి అంతు చిక్కని పరిస్థితి. సరైన పోలిక ఏంటంటే…. దారి తప్పి ఖర్చు చేస్తున్న మనిషిలా ఉంది ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరు. చిన్న రాష్ట్రాలకు ఆర్ధిక వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
అది తెలుసుకోకుండా అప్పులు కోసం ఎగబడితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికైనా పప్పు బెల్లాలకు ఖర్చు తగ్గించుకుని, ఆర్ధిక క్రమశిక్షణ అలవరచుకుంటే ప్రభుత్వానికి ఎంతో మంచిది. ఇంకో ఏడాది లేక రెండేళ్లు ఇదే పరిస్థితి ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ ను ఎవరూ కాపాడలేరు.




