రెండు తెలుగు రాష్ట్రాలలో నమోదైన కరోనా కేసులలో ఎక్కువగా ఢిల్లీలో జరిగిన ఇస్లాం మత ప్రచార సభకు వెళ్లిన వారే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ నెల 15,16,17లో ఢిల్లీలో జరిగిన ఈ సభకు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే 472మంది వెళ్లినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ సభకు తమిళనాడు, కర్నాటకలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.
కృష్ణా జిల్లా పరిధిలో 42 మంది ఉన్నట్టుగా గుర్తించారు. వీరిలో విజయవాడ సిటీ పరిధిలో 26 మంది గ్రామీణ జిల్లాలో మరో 16 మంది ఉన్నారు. అసలు వీరు ఢిల్లీలో ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు తిరిగి వచ్చారు? ఎలా తిరిగి వచ్చారు? వచ్చాకా ఎవరెవరిని కలిశారు అనే విషయాలపై ప్రభుత్వ అధికారాలు ఆరా తీస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బావమరిది కూడా ఈ సభకే వెళ్లి పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. ఆయన ఇచ్చిన పెద్ద పార్టీతో చాలా మంది అనుమానితుల లిస్టులో చేరిపోయారు. మరోవైపు ప్రభుత్వం ఈ 472 మందిని గుర్తించి వారిని నిర్బంధంలో 14 రోజుల పాటు నిర్ణయించుకున్నారు. వీరు కలిసిన వారితో కలిపి ఆ లిస్టు దాదాపుగా 2000కు చేరవచ్చని అంచనా.
ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో సోమవారం మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసులు తూర్పు గోదావరికి చెందిన రాజమండ్రి, కాకినాడలకు చెందినవి. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కేసులు 23కు చేరాయి. మరోవైపు కడపటి వార్తలు అందేసరికి తెలంగాణలో 70 కేసులు నమోదు అయ్యాయి.





