అమ్మా పెట్టదు అడుక్కోనివ్వదు అని ఒక సామెత ఉంది తెలుగులో. ఇప్పుడు తెలంగాణలోని ములుగులో అదే జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క లాక్ డౌన్ నాటి నుండీ తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కాలి నడకన వెళ్లి ఆహారం, నిత్యావసరాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
కనీసం రోడ్డు మార్గం లేని గిరిజన గ్రామాలకు సైతం వెళుతూ.. వారి ఆకలి తీరుస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు పేదలకు సాయం అందించాలని కోరుతున్నారు. ఇందుకోసం ‘గో హంగర్ గో’ చాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల ఆమె కాలికి చిన్నపాటి గాయం కూడా అయింది.
అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇంత పేరు రావడం ఏంటి అనుకున్నారో ఏమో… శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఏజెన్సీ గ్రామమైన రేగేళ్ల గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీకి బయలుదేరిన ఎమ్మెల్యేని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. నిత్యావసర సరుకుల పంపిణీకి ముందస్తు అనుమతి తీసుకోలేదని వెనక్కు పంపారు.
అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రేగేళ్ల ప్రాంతంలో మావోయిస్టుల కదలికల మీద సమాచారం ఉందని, ముందస్తు అనుమతి లేకుండా వెళ్ళకూడదని పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే మావోయిస్టుల కదలికలు ఉంటే ప్రజలు ఆకలితో అలమటించాల్సిందేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీతక్క అలియాస్ దనసరి అనసూయ గతంలో మాజీ నక్సలైట్ అనే విషయం తెలిసిందే.





