ఇండియన్ సినిమాలోనే తెలుగు సినిమా ఒక ప్రముఖ స్థానంలో ఉంది అనేది అందరు ఒప్పుకునే వాస్తవమే. అయితే టాలీవుడ్ ఈ స్థాయికి ఎదగడానికి ఎందరో దర్శకుల ప్రతిభ మరెందరో నిర్మాతల సాహసం, ఇంకెందరో నటీనటుల కష్టం ఇమిడి ఉంది.
ఇటువంటి ఒక ఇండివిడ్యువల్ శ్రామిక పరిశ్రమ గత కొన్నేళ్లుగా, ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన అనంతరం సినీ పరిశ్రమ రాజకీయ పెత్తనాన్ని ఎదుర్కొటుంది. నాటి బిఆర్ఎస్ నుంచి నిన్న వైసీపీ నేడు కాంగ్రెస్ వరకు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా తమ అధికారాన్ని చిత్ర పరిశ్రమ పై పెత్తనంగా వాడుతున్నారు.
సినీ పరిశ్రమ తెలంగాణలోని హైద్రాబాద్ లో స్థిరపడడంతో రాష్ట్ర విభజన తరువాత టాలీవుడ్ తెలంగాణ ఆస్తిగా మారిపోయింది. దీనితో బిఆర్ఎస్ తన అధికారంతో టాలీవుడ్ పెద్దలందరిని తనకు అనుగుణంగా మార్చుకొగలిగింది.
ఇక 2019 ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమ మొత్తం వైసీపీ దాటికి తాడేపల్లి ప్యాలస్ గేట్ దగ్గర కు చేరింది.
సినిమా టికెట్ల రేట్ల నుంచి హీరో రెమ్యునరేషన్ వరకు ఎవరు ఎంత తీసుకోవాలి, ఏ సినిమాకి ఎంత రేటు ఉండాలి అనేదాని వరకు సినీ పరిశ్రమ పై నిరవధికంగా వైసీపీ రాజకీయ పెత్తనం కొనసాగింది. ఆ పెత్తనం చివరికి టాలీవుడ్ ని మూగవాడిగా మార్చేసింది.
ఇక ఇప్పుడు తెలంగాణలో కొలువు తీరిన రేవంత్ సర్కార్ సైతం టాలీవుడ్ పై పెత్తనానికే మొగ్గు చూపుతుంది. పుష్ప సినిమా రిలీజ్ సమయంలో జరిగిన చేదు ఘటనతో టాలీవుడ్ పై మొదలైన రేవంత్ సర్కార్ హుకుం నాటికి కొనసాగుతూనే ఉంది అనే అభిప్రాయం చాలామందిలో బలంగా ఉంది.
పుష్ప రిలీజ్ సమయంలో జరిగిన అనుకోని ప్రమాదంలో అల్లు అర్జున్ అరెస్టు, ఆ పై ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటనలు, ఇక ఇప్పుడు సినిమా లాభాలలో కార్మికుల వాటా అంటూ సినీ పరిశ్రమ లావాదేవీల మీద వాటి వ్యాపార వ్యవహారాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అజమాయిషీ చెయ్యాలని భావించడం సినీ పరిశ్రమ పై రాజకీయ పెత్తనానికి మరో ఉదాహరణ.
అయితే టాలీవుడ్ సైతం ఇలా తమ పరిశ్రమ పై రాజకీయ పెత్తనం చేసే ప్రభుత్వాలకే పెద్ద పీటలు వేస్తుంది, వారికే పెద్దన్న హోదాను కల్పిస్తుంది. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వ విషయంలోనూ పరిశ్రమ పెద్దలుగా ఉన్నవారు బిఆర్ఎస్ రాజకీయానికి తలొగ్గారు, వారి పార్టీ పట్ల వారి ప్రభుత్వం పట్ల తమ విధేయత కనపరిచారు.
ఇక వైసీపీ ప్రభుత్వ విషయంలో కూడా టాలీవుడ్ నాటి నాయకుల అధికారం ముందు తలొగ్గింది. ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ హుకుం లకు సన్మానాలు చేస్తుంది. అయితే ఇంతలా తమ పరిశ్రమ పై తమ రాజకీయ పెత్తనం కొనసాగిస్తున్న నాయకులకు, ప్రభుత్వాలకు తలొగ్గుతున్న టాలీవుడ్ తమ పరిశ్రమను రాష్ట్రానికి ఆహ్వానించి వారికి పెద్ద పీట వేస్తామంటూ హామీ ఇస్తున్న ప్రభుత్వాలను ఆయా ప్రభుత్వ పెద్దలను పట్టించుకుంటుందా.? అనేది ఒక్కసారి ఆలోచించాలి.







