రాజకీయ ఫ్రెండ్‌షిప్… ఎవరి లెక్కలు వారివే!

Political leaders and friendship politics

నేడు స్నేహితుల దినోత్సవం (ఫ్రెండ్‌షిప్ డే). కనుక ‘స్నేహం విలువ’ అనే అంశంపై అనేక కొటేషన్స్, లెక్చర్స్ వినబడుతున్నాయి. వాట్సప్ గ్రీటింగ్స్, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్, మందు, విందు, చిందు షరా మామూలే. కానీ స్నేహం అంటే ఇంతేనా?అంటే కానే కాదు.

అంతకు మించి అని మన రాజకీయ నాయకులు నిరూపిస్తూనే ఉన్నారు. స్నేహానికి కొత్త పద్దతులు, నిర్వచనాలు కనిపెడుతూనే ఉన్నారు.

ADVERTISEMENT

స్నేహం విషయంలో ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలంటే ప్రధాని మోడీకే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనతో స్నేహం చేయాలనుకునే వారి జాబితా చాలా పెద్దది. ఆయన రాజకీయ స్నేహాల గురించి చెప్పుకుంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది. కానీ ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా నాలుగు ముక్కలు చెప్పుకుంటే స్నేహం ఎంత విలువైనదో అందరికీ మరింత బాగా అర్ధమవుతుంది.

ఉదాహరణకి ప్రధాని మోడీ-రాహుల్‌ గాంధీలు పార్లమెంటులో చిక్కుకున్న స్నేహితులు. వారు సఖ్యతగా సాగలేరు. అలాగని విడిపోలేరు.

మరో విశేషమేమిటంటే, ప్రధాని మోడీనీ రాహుల్‌ గాంధీ విమర్శిస్తుంటే, రేవంత్ రెడ్డి ‘మీరు నా పెద్దన్నవంటివారు..’ అంటూ మోడీతో స్నేహం కోసం పరితపిస్తుంటారు.

ప్రధాని మోడీతో కేసీఆర్‌ స్నేహం ఎక్కువ కాలం సాగలేదు. ఊరికే కత్తులు నూరి ఫామ్‌హౌసులో పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మోడీతో స్నేహం కోసం పరితపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

వచ్చే ఎన్నికల నాటికి బిజేపి-బీఆర్ఎస్‌ పార్టీల మద్య స్నేహం కుదరవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కనుక వారి రహస్య స్నేహాన్ని కాంగ్రెస్‌ నేతలు ‘కుమ్మక్కు’ అని కొత్త నిర్వచనం చెప్తున్నారు.

‘ప్రధాని మోడీతో మీరు కూడా అంట కాగుతునే ఉన్నారు కదా మీది కూడా కుమ్మకే’ అని బీఆర్ఎస్‌ పార్టీ నిందిస్తుంటుంది.

కనుక ఇక్కడ ‘కుమ్మక్కు’ అంటే ‘అదో రకమైన స్నేహమని’ అందరూ గ్రహించాలి

ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాని మోడీతో స్నేహమే కోరుకుంటున్నారు. కానీ బహిరంగంగా షేక్ హ్యాండ్ ఇచ్చి స్నేహం చేసేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. ఆయన స్నేహం లెక్కలు వేరేగా ఉన్నాయి. వాటి గురించి అందరికీ తెలుసు. ఈ లెక్కలే ఆయనని కాపాడుతున్నాయని సన్నాయి నొక్కులు నొక్కేవారు కూడా ఉన్నారు.

ఇక ప్రధాని మోడీతో చంద్రబాబు నాయుడు స్నేహం లెక్కలు వేరే ఉన్నాయి. వాటితో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో కొంత మేలు, కూటమి ప్రభుత్వానికి ‘ఉచిత రాజకీయ భీమా’ కూడా లభిస్తోందని చెప్పవచ్చు. దానిని యధాతధంగా కొనసాగించాలని సిఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు.

కానీ ప్రధాని మోడీ ‘మీరు విజనరీ’ అని మెచ్చుకుంటున్నారే తప్ప జగన్‌తో దోస్తీని వదులుకోవాలనుకోవడం లేదు. మనసులో మాట బయటకు చెప్పడం లేదు.

ఇదే.. ప్రజలని కూడా భయాందోళనలకు గురి చేస్తోంది. ఇదే.. వైసీపీకి కొండంత బలం, ధైర్యం కలిగిస్తోంది. తెలంగాణలో కూడా సేమ్‌ టూ సేమ్‌.

కనుక ఏపీ, తెలంగాణ రాజకీయాలలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని స్నేహమని ఖచ్చితంగా చెప్పలేము. కానీ అలాంటిదే!

ఈ స్నేహం ప్రేమగా మారవచ్చు. ఆ ప్రేమతో పెళ్ళి జరుగవచ్చు. విడాకులకు ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. కనుక ప్రేమ గురించి, స్నేహం గురించి ఇలా ఎంత చెప్పుకున్నా తరగదు.

కనుక నిజమైన స్నేహితులకు, రాజకీయ స్నేహితులకు, బహిరంగ స్నేహితులకు, రహస్య స్నేహితులకు అందరికీ స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.

ADVERTISEMENT
Latest Stories