మైదానంలో ప్రత్యర్థులుగా బరిలోకి దిగే రెండు జట్లు గెలుపు ఓటములను ఒకేలా తీసుకుంటూ గెలిచినవాడిని అభినందిస్తూ ఓడిన వాడికి చేయూతనిస్తూ మైదాన్ని విడుస్తారు. అలాగే ఆ క్రీడాకారులు కేవలం మైదానంలో ఉన్న సమయంలో మాత్రమే ప్రత్యర్థి టీం తో గెలుపు పోరాటం చేస్తారు.
ఆ తరువాత ఒకరితో ఒకరు సరదాగా ముచ్చటించుకుంటూ ఫ్రెండ్స్ లా మారిపోతారు. అది ఒలిపిక్స్ వంటి ఇంటర్ నేషనల్ మ్యాచ్ అయినా ఐపీల్ వంటి లోకల్ సిరీస్ అయినా ఒక్కటే తీరుగా ప్రవర్తిస్తారు. అలాగే కేవలం ఈ స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఒక్క క్రికెట్ లోనే కాదు ఇతర ఈ ఆటలో అయినా ఇదే విధంగా ఉంటుంది.
అయితే క్రీడలలో ఎదగడానికి అంతర్గత రాజకీయం జరిగితే ఇక్కడ రాజకీయాలలో పక్క వారిని ఎదగనివ్వకుండా ఆపడానికి పాలిటిక్స్ చేస్తారు. గతంలో కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు హోరాహోరి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే వారు. ఆ సమయంలో మాత్రమే ఆ పార్టీల మధ్య రాజకీయం నడిచేది.
ఆ తరువాత ఒకరిని ఒకరు కలుసుకోవడం, ఒకరి కుటుంబ వేడుకులకు మరొకరు వెళ్లడం, అలాగే ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య ఆయా పార్టీల నాయకుల మధ్య 365 ఉప్పు నిప్పు తరహా వాతావరణమే కనిపిస్తుంది.
ఈ తరం రాజకీయంలో రాజకీయ పార్టీలకు ప్రతిదీ రాజకీయమే అయిపోయింది. ప్రకృతి విపత్తుల నుంచి అనుకోని ప్రమాదాల వరకు, చావుల నుంచి హత్యల వరకు, పవిత్ర పుణ్య క్షేత్రాల నుంచి కల్తీ మద్యం తయారీ వరకు ప్రతి అంశంలోనూ ఒక పార్టీ పై మరొక పార్టీ దుమ్మెత్తిపోస్తూనే ఉంది. తప్పు నీదంటే నీది అంటూ రాజకీయం చేస్తూనే ఉంది.
ఈ పరిస్థితులు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలుగా నిలుస్తాయి. రాజకీయం అనేది కేవలం ఎన్నికల గెలుపు కోసమే ఉండాలి తప్ప తానూ, తన పార్టీ గెలిచే వరకు కొనసాగించకూడదు. అటువంటి రాజకీయం ప్రజాక్షేమాన్ని హరిస్తుంది, రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేస్తుంది.
రాజకీయ పార్టీల నాయకులలో కూడా ఈ స్పోర్టివ్ స్పిరిట్ రావాలని, అది కేవలం ఎన్నికల కురుక్షేత్రానికి మాత్రమే పరిమితమవ్వాలని, అధికార – ప్రతిపక్షాల మధ్య బంధం పాలు – నీళ్లు లా కలిసిపోకపోయినా పెట్రోల్ – నిప్పు మాదిరి తగలబడకూడదని ఆశిద్దాం.




